మళ్లీ కదులుతున్న ‘బండి’ , రెండోసారి సంచలనం సాధ్యమా?
x
బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ,

మళ్లీ కదులుతున్న ‘బండి’ , రెండోసారి సంచలనం సాధ్యమా?

తెలంగాణలో పది ఎంపీ స్థానాలు గెల్చుకోవానే కోరిక బండియాత్ర తోనే సాధ్యమని బిజెపి భావిస్తున్నదా? వివరాలు

 &

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. బీజేపీలో మాస్ లీడర్. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని కలలు కని, దానిని నిజం చేయడానికి అవసరమైన కార్యచరణ ప్రారంభించిన నాయకుడు. తన ప్రసంగాలతో యువతరాన్ని ఆకట్టుకుని, తెలంగాణలో పాదయాత్రల ద్వారా పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లాడు.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తామే అసలు ప్రత్యామ్నాయం అని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీలో విజయాలు సాధించి చూపాడు. బండి సంజయ్ దూకుడుతో ఇక తెలంగాణలో బీజేపీ దే అధికారం అని కేసీఆర్ తో పాటు, చాలామంది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ మేధావులు భావించారు. కొంతమంది బెంబేలెత్తని మేధావులు ఏకంగా ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసి కాషాయం చిరుగాలి సునామీ కాకుండా చూడండోయే అని పిలుపునిచ్చారు.

కానీ సీన్ కట్ చేస్తే.. బండి సంజయ్ ను తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా తొలగించి, కిషన్ రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. ఆ దెబ్బతో పార్టీలో ఉన్న ఉత్సాహం ఆవిరైంది. అధికారంలోకి వస్తుందని భావించిన పార్టీ కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పది సీట్లను సైతం గెలుచుకోలేక పోయింది.

కేంద్రంలో తిరిగి మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలదళం.. తెలంగాణ నుంచి కనీసం పది స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికలకు ముందు తిరిగి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ యాత్ర చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇది కరీంనగర్ ఎంపీ స్థానానికే పరిమితమైన.. బీజేపీ కి తిరిగి ప్రజాదరణ దక్కితే.. తెలంగాణ మొత్తం ఈ ‘కరీంనగర్ బండి’కదిలే అవకాశం ఉంది.

ఈ నెల 10న ముహూర్తం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమ ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.

అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు.

తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. యాత్రలో భాగంగా అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

తొలిరోజు సాగేదిలా..

తొలిరోజు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నేగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర చేస్తారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనంపై వెళతారు. గ్రామాల్లో మాత్రం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంతో తెలంగాణలో బీజేపీ రూపురేఖలే మారిపోయాయని, అదే తరహాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టే యాత్రతో నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతుందన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర చేసిన ప్రతి చోటు బీజేపీ బలపడిందని, ఓటింగ్ శాతం కూడా పెరిగిందని బండి సంజయ్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. రాష్టంలో 11 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం తథ్యమని జాతీయ మీడియా, సర్వే సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

ఆ నాటి జోష్ఉంటుందా ?

గతంలో బండి యాత్ర ప్రారంభించేనాటికి రాష్ట్రంలో కెసిఆర్ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకాబల హీనంగా ఉండింది. దానికి తోడు మూడు ఎన్నికల్లో బిజెపి గెలిచింది. ఈ లోపు కెసిఆర్ తెలంగాణ పార్టీనికి జాతీయ పార్టీగా మార్చేశారు. నేపథ్యంలో బండి సంజయ్ చెప్పే ప్రతి మాట తూటాల్లాపేలింది. కార్యకర్తులు రెచ్చిపోయారు. ప్రజలు బేష్ అన్నారు. విశ్లేషకులు ఇక బిఆర్ ఎస్ ప్రత్యా మ్నాయం బిజెపి యే అన్నారు. కాంగ్రెస్ లీడర్లు మెల్లిగా బిజెపి వైపు వలస పోవడం మొదలుయింది. అయితే రేవంత్ కాంగ్రస్ నాయకత్వం తీసుకోవడంతో సీన్ మారిపోయింది. ఇపుడు బిఆర్ ఎస్ బలహీనపడింది. మళ్లీ లేస్తుందో లేవదో తెలియని పరిస్తితి. కాంగ్రెస్ బాగా జోరుగా ఉంది. ముఠాలు ప్రస్తుతానికి పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు సమిష్టిగా పనిచేస్తున్నారు పార్టీ నుంచి ఒక అసమ్మతి స్వరం వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో బండి ప్రజలను ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. బండి సంజయ్ కు తన దైన శైలి ఉంది. తెలంగాణ యాసలో గుచ్చుకునేలా మాట్లాడే శక్తి ఉంది. అయితే, ఆయన ఈ సారి బిఆర్ ఎప్ ను, కెసిఆర్, ను కెటిఆర్ ను, ఆయన కుటుంబాన్ని తిట్ట లేరు. వాళ్లు పరాజయం పరాభవం నుంచి ఇంకా కోలుకో లేదు. కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వాన్ని అంత తొందరగా దుయ్యబట్టడం కష్టం. మరి ఏంచెబుతారు? ఇదే ప్రశ్న. కేంద్రం ఘనవిజయాలను చెప్పి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పెద్దగా తెలంగాణ ప్రజలను మెప్పించలేకపోయారు. మరి బండి దగ్గిర బాణాలేంటి?

Read More
Next Story