
రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తెలంగాణ కేబినెట్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానుంది. బిసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో చర్చించనున్నారు. బిసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం న్యాయనిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటికే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. రేపు రిజర్వేషన్ల అంశంపై ఎలాముందుకు వెళ్లాలి, తదుపరి కార్యాచరణ ప్రణాళికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ లో చర్చించనున్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిశ్చయించుకుని, ఆ దిశగా ముందడుగులు వేసింది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకురావడమే గాక ప్రత్యేక జీవోనూ తీసుకొచ్చింది. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా చేపట్టే చర్యలపై గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీ చేయకూడదు అనే నిబంధనను గత కేబినెట్ లో తొలగించారు. మంత్రి సీతక్క ఇందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. 30 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఈ చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం సిద్దమైంది. కేబినెట్ లో ఈ అంశంపై చర్చించనున్నారు. చట్ట సవరణను ప్రత్యేక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.