రేవంత్ రణన్నినాదం ఈసారీ అక్కణ్ణుంచే..  సెంటిమెంటా! సేఫ్ గేమా!!
x
రేవంత్ ఎన్నికల ప్రచారం (పాత పోటో)

రేవంత్ రణన్నినాదం ఈసారీ అక్కణ్ణుంచే.. సెంటిమెంటా! సేఫ్ గేమా!!

పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ ఏ సెంటిమెంటును పాటించారో పార్లమెంటు ఎన్నికలకూ దాన్నే అనుసరించబోతున్నారు. కాకుంటే ఈసారి ముఖ్యమంత్రి హోదాలో..


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా కలిసొచ్చిందా? ఈసారీ అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారా? పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలోనే రేవంత్ రెడ్డి తొలి సభ నిర్వహించారు. ఇదే సెంటిమెంట్‌ను ఇప్పుడు కూడా అనుసరించబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో తొలి సభలో పాల్గొనబోతున్నారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని నేతలను, అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న 14 ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు.

షెడ్యూల్ కి ముందే తొలిదశ పూర్తి...

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆదిలాబాద్ జిల్లా అమరవీరుల త్యాగస్థలి ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ప్రచార పర్వం ప్రారంభించి తొలి విడత పూర్తి చేయాలని సంకల్పించారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నుంచే ఎన్నికల రణభేరి మోగించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత వారానికి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల్ని తమవైపు తిప్పుకునే వ్యూహం రచిస్తోంది హస్తం పార్టీ.

కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం పార్లమెంటు ఎన్నికలు...

ఏ విధంగా చూసినా తెలంగాణ కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి బీటలు వారడం మొదలైన తరుణంలో దక్షిణాదిలో సీట్లు గెలవడం కాంగ్రెస్ అధిష్టానానికి చాలా ముఖ్యం. తెలంగాణలోని 17 నియోజకవర్గాలలో కనీసం 14 సీట్లు గెలవకపోతే కాంగ్రెస్ కు కష్టకాలమే. బీఆర్ఎస్, బీజేపీ దాడులను ఎదుర్కొంటూనే కాంగ్రెస్ ముందుకు సాగాలి. ఆ బాధ్యత ప్రధానంగా సీఎం సీట్లో ఉన్న రేవంత్ రెడ్డిపై చాలా ఎక్కువ.

ప్రతి నియోజకవర్గానికి ఓ మంత్రి, ఇంకో సీనియర్ నేత...

పార్లమెంట్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్‌.. రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మంత్రులు, సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మహబూబ్‌నగర్‌, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాల బాధ్యతలు తీసుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఖమ్మం, మహబూబాబాద్‌కు ఇన్‌చార్జీలుగా నియమించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బూత్‌ స్థాయి కన్వీనర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరికి ఈపాటికే దిశానిర్దేశం చేశారు.

ఫిబ్రవరి చివర్లోనేనా ఎన్నికల షెడ్యూల్...

ఇక ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముందన్న చర్చ నేపథ్యంలో.. అంతకుముందే ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం రేవంతరెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఎల్బీ స్టేడియం సభలోనే స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. సీఎం పర్యటనల సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఫిబ్రవరి మొదట్లో మరో రెండు హామీలు అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి సభలో ఒక పథకంపై ప్రకటన చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ను ప్రకటించే అవకాశముందన్న చర్చ నడుస్తోంది. దీని వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులకు కాంగ్రెస్‌ చేరువయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే సమయంలో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే స్కీమ్‌ను కూడా అమలు చేసే యోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story