
పేరెంట్స్ 'గుండె కోత' తీర్చేందుకు ఉద్యోగుల జీతాల కోత
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం కోత బిల్లు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
"శకుంతలాబాయి 90 ఏళ్ల వృద్ధురాలు ,హైదరాబాద్ ముసరాంబాగ్ కు చెందిన ఈమెను కుమారులు పట్టించుకోకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసింది.తల్లిని పట్టించుకోని కుమారులు ఇంట్లో ఉండటానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు.అయినా మారక పోవడంతో ఇంటిని సీజ్ చేశారు".ఇటీవల జరిగిన ఈ సంఘటన అధికారుల సామాజిక స్పృహను తట్టి లేపింది.ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది.
ఒక్క శకుంతలాబాయి మాత్రమే కాదు ,ఈమె ఒక ఉదాహరణ మాత్రమే..పిల్లల ఆదరణ కరువైన అనేకమంది వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి ఇదే.రక్త మాంసాలను కరిగించి , తాము తిన్నా తినకపోయినా , పిల్లల భవిష్యత్ కోసం అహర్నిశలూ పరితపించిన తల్లిదండ్రులు ఎందరో వృద్ధాప్యంలో కన్నబిడ్డల నుంచే నిర్లక్ష్యానికి గురవుతున్నారు.ఉన్న ఆస్తిని లాక్కొని వెళ్లగొట్టేవారు కొందరైతే, అనాథలుగా వృద్ధాశ్రమాలలో వదిలి వచ్చే వారు మరికొందరు.తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిలో ప్రభుత్వ ఉద్యోగులూ వుంటున్నారు.
పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల రూపాయల జీతం సంపాదించే వారు సైతం తల్లిదండ్రులను పట్టించుకోవాలంటే ఆసక్తి చూపడంలేదు.వారిని పెద్ద భారంగా భావిస్తున్నారు.మరి ఇలాంటి దౌర్బాగ్య పరిస్థితులు మళ్లీ మళ్లీ చోటుచేసుకోకుండా సమాజంలో మార్పు రావాలి.మార్పు కోసం ప్రభుత్వ పరంగా చర్యలు వుండాలి.సరిగ్గా ఇదే ఆలోచన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత!
తమను ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్న కొంతమంది ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది.తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల సాలరీ నుంచి కోత పెట్టి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే విధానాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఉద్యోగుల జీతాలలో 10–15% నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేయవచ్చో లేదో పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదికను సమర్పించాలని అధికారులను కోరారు.ఇప్పుడు సీఎం ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.అసలు ప్రభుత్వ పరంగా ఈ చర్య సాధ్యమా.. అధికారులు నివేదిక ఏమి సమర్పిస్తారనేది ఆసక్తిగామారింది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత లభించడమే కాకుండా, పిల్లలు తమ బాధ్యతలను గుర్తించేలా చైతన్యం వస్తుంది. సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ప్రభుత్వ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.మరి పిల్లలపై ఫిర్యాదు చేయడానికి వృద్ధులైన తల్లిదండ్రులు ముందుకు వస్తారా..? బాధలు పడుతూనే ఫిర్యాదుకు ముందుకురాని వారి విషయంలో ఏమిచేస్తారన్నది ప్రశ్నగా మిగులుతోంది.ప్రభుత్వ పరంగా ఉద్యోగులను చైతన్యపరిచే చర్యలను అందరూ స్వాగతిస్తున్నారు. త్వరగా దీనిని చట్టంగా తేవాలని కోరుకుంటున్నారు.
మహారాష్ట్ర, అసోంలు ఆదర్శం
ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ వృద్ధులైన కన్న వారిని పట్టించుకొని ఉద్యోగుల విషయంలో మహారాష్ట్ర ,అసోం ప్రభుత్వాలు గతంలోనే చర్యలకు ఉపక్రమించాయి.అసోం ప్రభుత్వం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతంలో కోత విధించడానికి , తగ్గించిన సొమ్మును తల్లిదండ్రుల ఖాతాలలో వేయడానికి అనుమతి ఇస్తూ 2017 లోనే బిల్లును తీసుకు వచ్చింది."The Assam Employees’ Parents Responsibility and Norms for Accountability and Monitoring Bill, 2017"అయితే ఆ బిల్లుపై కొన్ని పక్షాలు అభ్యంతరం చెప్పాయి.ప్రభుత్వ ఉద్యోగులను విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యల విషయం సరే, తల్లిదండ్రులను పట్టించుకోని మిగిలిన వారిని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించాయి.ప్రభుత్వం నుంచీ చర్యలు వుంటాయన్న భయం అందరిలో రావాలని , ముఖ్యంగా సామాజిక చైతన్యం అవసరమన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలను 2021లోనే చేపట్టింది. లాతూర్ జిల్లాపరిషత్ పరిధిలో పనిచేసే కొందరు ఉద్యోగులపై వారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగుల జీతాల్లో 30 శాతం కోత విధించారు.ఆ నగదును వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు.12మంది ఉద్యోగుల పై తమకు ఫిర్యాదులు అందాయని, అనంతరం 5గురు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని తెలిపారు.పట్టించుకోని మిగతా ఏడుగురి జీతంలో కోత విధించినట్లు పేర్కొన్నారు.లాతూర్ పరిణామాల తరువాత మరికొన్ని జిల్లాపరిషత్ ల పరిధిలోనూ ఇదే విధానాన్ని ఆమోదించారు. ప్రభుత్వం కూడా బిల్లు దిశగా అడుగులు వేసింది.
తమకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం జీవితం ధారపోసిన కన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడానికి కూడా మనసు రాని పాశాణ హృదయులు మన సమాజంలో కోకొల్లలు.ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం ఎంతో సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ కూడా రాని ఈ పరిస్థితులలో తగిన చట్టం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిందే.అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వృద్ద తల్లిదండ్రుల విషయంలోనే కాకుండా పిల్లలు మంచి పొజిషన్ లో వుండీ అనాథలుగా మిగులుతున్న మిగిలిన వృద్ధుల విషయంలోనూ చర్యలకు ప్రభుత్వం ఆలోచించాల్సి వుంది.
Next Story