‘డ్రగ్స్ కేసులో ఎవరున్నా వదలొద్దు’.. అధికారులకు రేవంత్ ఆదేశాలు
x

‘డ్రగ్స్ కేసులో ఎవరున్నా వదలొద్దు’.. అధికారులకు రేవంత్ ఆదేశాలు

రాష్ట్రంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని వెల్లడించారు..


బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రెండు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. మొన్నటివరకు ఈ డ్రగ్స్ మూలాలు ఆంధ్రలో ఉన్నాయని అధికారులు అనుమానించారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ మూలాలు తెలంగాణలో కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగానే డ్రగ్స్ వినియోగించింది ఎవరైనా ఉపేక్షించొద్దని, వారు ఎంత పెద్దవారైనా, ఎంత పలుకుబడి ఉన్న వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి విషయంలో రాజీ అన్నమాటకు స్థానం కూడా ఉండకూడదని, డ్రగ్స్ రహిత తెలంగాణకు కృష్టి చేద్దామని అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మొదటి నుంచి ఇలానే

గతేడాది తెలంగాణ సీఎంగా అధికారం చేపట్టిన క్షణం నుంచి కూడా డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. దేశంలో మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపైనే కీలక అధికారులతో నిర్వహించిన సమావేశంలో కూడా రేవంత్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. డ్రగ్స్‌ను నివారించడంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాల్సి ఉందని, డ్రగ్స్ వ్యవహారం వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఆయన వివరించారు. డ్రగ్స్ సరఫరాలపై మరింత పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని, ఎవరైనా డ్రగ్స్‌ను సరఫరా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

‘‘డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, పెద్దపెద్ద వారు ఉన్నా వదిలి పెట్టొద్దు. అవసరం అయితే యాంటీ డ్రగ్స్ టీమ్‌లను సిద్ధం చేయండి. డ్రగ్స్ నిర్మూలన కోసం సమర్థవంతంగా పనిచేసేవారిని ప్రోత్సహించాలి. డ్రగ్స్‌ను నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. డ్రగ్స్ నిర్మూలన అంశంపై ప్రభుత్వం చాలా స్పష్టం వ్యవహరిస్తుంది. వాటి నివారణ కోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకు సాగాలి’’అని ఆయన వివరించారు.

ఆకస్మిక తనిఖీలు పక్కా

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో తనిఖీలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు.. సీఎంకు వివరించారు. దీంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రమంతటా తనిఖీలను ముమ్మరం చేయాలని రేవంత్ సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశాలిచ్చారు.

Read More
Next Story