కిర్గిజ్ స్థాన్ దాడులపై తెలంగాణ సీఎం సమీక్ష
x

కిర్గిజ్ స్థాన్ దాడులపై తెలంగాణ సీఎం సమీక్ష

బిష్కెక్ ఘటనలపై తెలంగాణ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణకి చెందిన విద్యార్థుల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు.


కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో విదేశీ విద్యార్ధులపై స్థానికులు దాడి చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ ఉంటున్న విద్యార్థుల సేఫ్టీ పై ఇండియాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిష్కెక్ ఘటనలపై తెలంగాణ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణకి చెందిన విద్యార్థుల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించి సీఎంకి వివరించారు.

భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని అరుణ్ కుమార్ చెప్పారు. "ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారని తెలిపారు. కిర్గిజ్ స్థాన్ లో జరిగిన ఘటనలలో భారతీయ విద్యార్థులు ఎవరూ తీవ్రంగా గాయపడటంగానీ, ఆసుపత్రిలో చేరటం లాంటివి గానీ జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూసి భయపడవద్దని" భారత రాయభారి అరుణ్ కుమార్ సూచించారు.

కిర్గిజ్ స్థాన్ లో దాడులపై హరీష్ రావు ఆందోళన..

కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో విదేశీ విద్యార్ధులపై జరుగుతున్న దాడులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో భారతీయ విద్యార్థులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలువురు భారతీయ విద్యార్థులతోపాటు వివిధ దేశాల విద్యార్ధులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్టమైన చర్యలు టీయూకోవాలని తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారుల్ని, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ని, బిష్కెక్ లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరుతున్నాను. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి దౌత్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అంటూ హరీష్ రావు పోస్ట్ చేశారు.



Read More
Next Story