ఢిల్లీ బాట పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు.. అందుకోసమేనా..!
x

ఢిల్లీ బాట పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు.. అందుకోసమేనా..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన క్రమంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చల్లోకి వచ్చింది.


తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన క్రమంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చల్లోకి వచ్చింది. ఈ సారైనా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా లేదా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై స్పందించిన భట్టి విక్రమార్క.. మంత్రివర్గ విస్తరణలో తమ పాత్రేమీ లేదని, అంతా హైకమాండ్‌దేనని తేల్చి చెప్పారు. క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో ఎవరికి పదవులు ఇవ్వాలని, ఎవరికి ఇవ్వకూడదు అన్న అన్ని విషయాలను పరిశీలించి పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయాన్నే తెలంగాణ కాంగ్రెస్ శిరసావహిస్తుందని భట్టి వెల్లడించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హస్తినాపురానికి పయనమవుతున్నారు. ఎలాగైనా అధిష్ఠానాన్ని మెప్పింపజేసి.. పదవి పట్టేయాలని వ్యాహాలు రచిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలు రచించి వాటిని ఆచరణలో కూడా పెట్టేస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం కంట్లో పడి.. మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఇప్పటికే కొందరు ఢిల్లీ చేరిపోయారని, ఇంకా మరికొందరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఎవరి వ్యూహం వారిదే..

ఇదిలా ఉంటే ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రస్ నేతలు కాంగ్రెస్ నేతలు పదవులు పొందడం కోసం పార్టీ హైకమాండ్‌తో మంతనాలు జరపనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలువురు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపారు. కాగా కొందరు మంత్రి పదవులు పొందుదామని ఢిల్లీకి పయనమవుతుంటే.. మరికొందరు అతి త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పొందాలని, అందుకోసం పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రచిస్తున్న వ్యూహాల్లో ఎవరిది పారుతుంది, ఎవరికి వికటిస్తుందో చూడాలి. అయితే మంత్రివర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అన్న అంశంలో తుది నిర్ణయం పార్టీ హైకమాండే తీసుకుంటుందని తేల్చి చెప్పేశారు.

భట్టి ఏమన్నారంటే..

‘‘మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 100% మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజం. హైడ్రాకి ధనిక, పేద అన్న తేడా లేదు. ఎవరు చెరువులను ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం. రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాం. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుంది. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదు టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ తల్లి ఉండేది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో ₹ 64 వేల కోట్ల అసలు వడ్డీలు కట్టాం. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి ₹ 6,400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే 64 వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డాం. పదేళ్ల తరువాత హాస్టల్స్ కి ఇచ్చే డైట్ చార్జీలు పెంచాం. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు,విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం. గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నాం’’ అని వివరించారు.

రేవంత్ చేతిలో అభ్యర్థుల జాబితా..

పదవులు పొందడం కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మరో చర్చ కూడా జోరుగా సాగుతోంది. వీరు ఎంత ప్రయత్నించినా ఇప్పటికే సీఎం రేవంత్ చేతికి కొందరు అభ్యర్థుల పేర్లు వెళ్లాయని, వాటిని పరిశీలించిన తర్వాతనే పార్టీ హైకమాండ్‌ మంత్రి వర్గ విస్తరణపై ఒక క్లారిటీ ఇవ్వనుందని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం చేతిలో ఉన్న జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారగా. తన పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల్లో తహతహలాడుతున్నారు. మరి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ టికెట్లు ఎవరెవరిని వరిస్తాయో చూడాలి. ఎవరి వ్యూహం ఎంతవరకు ఫలితిస్తోందో.

Read More
Next Story