బంగ్లాదేశ్ ఎఫెక్ట్... వారిపై నిఘా ఉంచామన్న డీజీపీ
x

బంగ్లాదేశ్ ఎఫెక్ట్... వారిపై నిఘా ఉంచామన్న డీజీపీ

తెలంగాణలో ప్రజల భద్రతకు, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.


తెలంగాణలో ప్రజల భద్రతకు, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'హ్యాకథాన్-2024' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.

బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లోను నిఘా ఉంచామని డీజీపీ జితేందర్ తెలిపారు. నగరానికి ఎవరైనా అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు చర్యలు చేపడతామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.

సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్...

ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం అని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి చాలా సైబర్ క్రైమ్ కేసులను ఛేదించామని ఆయన తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలకు తిరిగి నగదు చెల్లింపులు చేశాం. గత ఏడాదిలో సైబర్ క్రైమ్ వల్ల డబ్బు కోల్పోయిన బాధితులకు రూ.150 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తిరిగి అందజేశామన్నారు. ఈ హ్యాకథాన్లో దేశ విదేశాల నుంచి సుమారు 10వేల మంది పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం అని డీజీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More
Next Story