
‘పవర్ షేరింగ్ మాటే లేదు’
కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో జరగదు. ఇక్కడ పక్కా క్లారిటీతో ముందుకెళ్తున్నాం.
కాంగ్రెస్ పాలిన రాష్ట్రాల్లో ప్రస్తుతం పవర్ షేరింగ్ అంశం కీలకంగా మారింది. తెలంగాణలో కూడా ఇదే సాంప్రదాయం అమలవుతుందేమో అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫుల్‌స్టాప్ పెట్టారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో ఎటువంటి పవర్ షేరింగ్ లేదని, ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అన్ని విషయాల్లో స్పష్టతతో ఉందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా కలిసి కట్టుగా ఒక టీమ్‌లా కుటుంబంలో పనిచేస్తున్నామని చెప్పారు. అనంతరం పలు కీలక అంశాలపై ఆయన స్పందించారు. తెలంగాణలో చేపట్టిన రుణమాఫీ, పేదలకు అందిస్తున్న సన్నబియ్యం వంటి అనేక పథకాల గురించి ఆయన వివరించారు. అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతల మాటలు మితిమీరి ఉంటున్నాయని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఒళ్లు మండిపోతోందని, అందుకే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాగా రూ.2లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి రుణమాఫీ చేయకూడదు అనేది తమ ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. అదే విధంగా తమ ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీని అమలు చేసిందని వెల్లడించారు. మొన్నటి వరకు అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా పేదలకు తినడానికి వీలులేని దొడ్డు బియ్యం రేషన్‌గా అందించిందని, దానిని ప్రజలు అమ్ముకున్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం సన్నబియ్యం అందించి.. రేషన్ బియ్య అమ్మకాలకు చెక్ పెట్టిందని తెలిపారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందించడం గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా అన్నారు. గతంలో మాదిరిగా రేషన్ సరుకులు ఇప్పుడు పక్కదారి పట్టడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఒక మహిళల అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను వారికి అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ప్రతిబింబిస్తుందని చెప్పారు. అతి త్వలోనే మహిళల సౌకర్యార్థం మరో 3వేల బస్సులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుంది. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుంది. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదు. సిగాచీ ప్రమాదంపై విచారణకు ఆదేశించాం. ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.