వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు రూ.130 కోట్ల విరాళం
x

వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు రూ.130 కోట్ల విరాళం

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం ఉద్యోగులందరినీ అభినందించారు. "వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూలవేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక. మనస్పూర్తిగా వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతాను" అని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి రూ. 130 కోట్లు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి పొంగులేటి ప్రశంసించారు. ఉద్యోగులుకి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కిట్టీ బ్యాంకు నుంచి వరద సహాయం...

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకుంది. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది. మహబూబాబాద్ కలెక్టరేట్ లోరేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేయగా.. సీఎం విద్యార్థినిని అభినందించారు.

Read More
Next Story