తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించి రాష్ట్ర కూలీలకు గుండె కోత మిగిల్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ఆరోపించారు. ఒక కోటి 50 లక్షల పని దినాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కింద పది కోట్ల పని దినాలు కల్పించాలని చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కూలీలకు గుండె కోత మిగిల్చారు... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కోటి 50 లక్షల పని దినాల కోత విధించి కూలీ పనులు చేసే వారికి గుండె కోతకు గురిచేస్తోందని ఉమ్మడి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకం ద్వారా పూట గడుపుకునే కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
కూలీలకు అన్యాయం చేశారు... తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా.. కేవలం 6.5 కోట్ల కొన్ని దినాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ,కూలీ పనులు చేసుకునే వారి కుటుంబాలకు తీరని అన్యాయం చేసిందని చిన్నారెడ్డి ఆరోపించారు.
కూలీల పనిదినాల్లో కోత ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోందని, అందుకు తాజా నిదర్శనం ఉపాధి హామీ పథకంలో ఒక కోటి 50 లక్షల పని దినాలు కుదించడమేనని చిన్నారెడ్డి పేర్కొన్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో వరుసగా ప్రతిఏటా 10 కోట్ల ఉపాధి హామీ పని దినాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు విజయవంతంగా కొనసాగాయని చిన్నారెడ్డి వివరించారు.
కూలీల వలసలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పని దినాలలో కోత విధించడం వల్ల కూలీలకు పనులు లభించగా వలస వెళ్లాల్సిన దుస్థితి కలుగుతోందని చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.2004 లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యు.పీ.ఏ. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ఉమ్మడి రాష్ట్రం అనంతపురం జిల్లాలో అప్పట్లో ఉపాధి హామీ పనులకు తాను మంత్రిగా ఉన్న హయాంలో వైఎస్సార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చిన్నారెడ్డి గుర్తు చేశారు.
కేంద్రమంత్రులు నోరు విప్పాలి...
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని, ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పది కోట్ల పని దినాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.