అటవీశాఖలో గుబులు రేపిన ఏనుగు...మళ్ళీ ఏం చేస్తుందో ?
x
elephants in forest

అటవీశాఖలో గుబులు రేపిన ఏనుగు...మళ్ళీ ఏం చేస్తుందో ?

ఇప్పటివరకు మహారాష్ట్రా, ఏపీ, కర్నాటక, తమిళనాడును మాత్రమే ఇబ్బందిపెడుతున్న ఏనుగుల సమస్య తొందరలోనే తెలంగాణాలో కూడా ఎదురవబోతోంది.


మునుపెన్నడూ ఎదురుచూడని కొత్త సమస్య తెలంగాణాను ముంచెత్తబోతోంది. రాబోయే విపత్తును తలచుకుని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆందోళన పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటివరకు మహారాష్ట్రా, ఏపీ, కర్నాటక, తమిళనాడును మాత్రమే ఇబ్బందిపెడుతున్న ఏనుగుల సమస్య తొందరలోనే తెలంగాణాలో కూడా ఎదురవబోతోంది. తెలంగాణా అటవీశాఖ ఉన్నతాధికారులు, సరిహద్దుల్లోని జనాలు ఎందుకింతగా ఆందోళనపడుతున్నట్లు ? ఎందుకంటే ఈమధ్యనే తెలంగాణాలోని కుమరంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్లో ఒక మగ ఏనుగు సంచరించింది. ఉత్తగా సంచరించటమే కాకుండా ఇద్దరిని చంపేసింది కూడా. అటవీప్రాంతాలకు దగ్గరలోనే ఉన్న చింతలమానేపల్లి, పెంచికల్ పేట మండలాల్లోని అటవీప్రాంతాల్లో సంచరించింది. తనదారికి అడ్డువచ్చారని, అదిలించారన్న కోపంతో ఇద్దరిని వెంటపడి చంపేసింది. సంఘటన జరిగినదగ్గర నుండి జనాల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇదేసమయంలో విషయం తెలుసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు.

జనాల్లో అయినా ఉన్నతాధికారుల్లో అయినా ఎందుకింత కలవరం మొదలైందంటే తెలంగాణా భూభాగంలోకి ఒక ఏనుగు రావటం, అడ్డొచ్చారని ఇద్దరిని తొక్కిచంపేయటం ఇదే మొదటిసారి. దాదాపు 24 గంటలపాటు అటవీప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లు సంచరించిన ఆ ఏనుగు తర్వాత దానంతట అదే వచ్చిన దారిలోనే తిరిగివెళ్ళిపోవటంతో జనాలు, ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మహారాష్ట్రలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీప్రాంతంనుండి 60 ఏనుగుల గుంపులో నుండి ఒక మగఏనుగు విడిపోయి అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలో తినటానికి పచ్చటి పంటలు, తాగటానికి సమృద్ధిగా నీరున్నది. అందుకనే తిన్నంత తినేసి, తాగినంత నీరు తాగి 24 గంటలు సంచరించి తిరిగి వెళ్ళిపోయింది. వచ్చిన ఏనుగు తిరిగివెళ్ళిపోయింది కాబట్టి ఇక సమస్యలేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇపుడు వెళ్ళిపోయిన ఏనుగు తన గుంపును చేరి మళ్ళీ అన్నింటినీ కాగజ్ నగర్ అటవీప్రాంతానికి తీసుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. గడ్చిరోలి ప్రాంతంలో తినటానికి తిండి, తాగటానికి నీరు తగ్గిపోతున్నది. అందుకనే కాగజ్ నగర్ ప్రాంతంలో తిండి. నీటిని చూసిన మగఏనుగు తన గుంపును మళ్ళీ ఇక్కడికి కచ్చితంగా తీసుకువస్తుందని అటవీశాఖ ఉన్నతాధికారులు భయపడుతున్నారు.

గుంపులోని ఒక ఏనుగుకు ఆహారం, నీరు ఎక్కడైనా కనబడితే అదివెళ్ళి తన గుంపుమొత్తాన్ని తీసుకువస్తుంది. గుంపుతో కలిసి ఆహారం, నీటిని తీసుకోవటం ఏనుగులకున్న అలవాటు. అందుకనే ఏరోజైనా ఏనుగుల గుంపు కాగజ్ నగర్ అటవీప్రాంతంలో అడుగుపెట్టే అవకాశముందని అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒక ఏనుగు వస్తేనే ఇద్దరిని తొక్కి చంపేసింది. అలాంటిది ఏకంగా మళ్ళీ తన గుంపుతో అడుగుపెడితే ఎలాంటి విధ్వంసానికి దిగుతాయో అని ఆందోళనపడుతున్నారు. ఏనుగుల దాడులు, విధ్వంసాలు ఏపీ, కర్నాటక, తమిళనాడులో సాధారణం. పంటపొలాల మీద ఏనుగుల గుంపు దాడిచేసి విధ్వంసం చేసేస్తాయి. అలాగే ఎదురొచ్చిన వారిని, తమపై దాడికి దిగుతున్నారని అనుకున్న వారిని వెంటపడి తరిమి చంపేసిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఏనుగులు చాలా సున్నితంగా ఉంటాయి. అలాగే వాటి జ్ఞాపకశక్తి కూడా అపారం. తమకు తిండి, నీరు దొరికే ప్రాంతాలతో పాటు తమను గాయపరిచిన వ్యక్తులను బాగా గుర్తుపెట్టుకుని సమయం దొరికినపుడు వెంటపడి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇదే విషయమై కాగజ్ నగర్ అటవీ ప్రాంతం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సీసీఎఫ్) శాంతారాం ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ఏనుగుల గుంపు తెలంగాణా అటవీ ప్రాంతాల్లోకి రానీయకుండా ఆపలేమన్నారు. అయితే గ్రామాల్లోకి ఏనుగులను అడుగుపెట్టనీయకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒక మగఏనుగు రెండు మండలాల్లో తిరిగి ఇద్దరిని చంపేయటం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు తెలంగాణా అడవుల్లో ఏనుగు సంచరించిన ఆనవాళ్ళు లేవన్నారు. తొందరలోనే గడ్చిరోలి ప్రాంతంలో సంచరిస్తున్న మిగిలిన ఏనుగులు తెలంగాణాలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆందోళనవ్యక్తంచేశారు. అటవీ ప్రాంతాలకు, గ్రామాల సరిహద్దలకు మధ్య కంచెలు వేయటం, విద్యుత్ కంచెలు ఏర్పాటుచేయటం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. అటవీసరిహద్దుల్లోని గ్రామాల్లో తమ అధికారులు, సిబ్బంది తిరుగుతు ప్రజలను ఏనుగుల దాడిజరిగే అవకాశాలున్నాయని అప్రమత్తంచేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఈనెల 22, 24 తేదీల్లో ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లు శాంతారం చెప్పారు.

Read More
Next Story