
‘మాకు న్యాయం చేయండి’: ఆందోళనబాట పట్టిన గిగ్ వర్కర్లు
గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్.
యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ, హోబ్‌బేస్డ్ సర్వీస్ వర్కర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(TGPWU) వ్యాఖ్యానించింది. వారికి న్యాయం చేయడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించాలని కోరింది. ఈ మేరకు బుధవారం పోర్టర్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసింది. డ్రైవర్ల పని వేళలు, ఆదాయం, జీవనోపాధి పరిస్థితులు తీవ్రంగా దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై తక్షణ జోక్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా, పోర్టర్ యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని టిజిపిడబ్ల్యుయు ఆరోపించింది. దీంతో డ్రైవర్లు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ కార్మిక కమిషనర్, అదనపు కార్మిక కమిషనర్లకు టిజిపిడబ్ల్యుయు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇందులో పోర్టర్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రధాన డిమాండ్లు ఇవే:
న్యాయమైన ధరల విధానం:
ట్రిప్ రేట్లలో అకస్మాత్తుగా జరిగిన భారీ తగ్గింపులు డ్రైవర్లను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని యూనియన్ తెలిపింది. ఇంధనం, వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమైన బేస్ ఫేర్, కిలోమీటర్ రేట్లను పునరుద్ధరించాలని, ధరల విధానంలో అకస్మాత్తు మార్పులు చేయకూడదని డిమాండ్ చేసింది.
క్యాన్సిలేషన్ ఛార్జీలు డ్రైవర్లకే:
కస్టమర్ల క్యాన్సిలేషన్ల వల్ల డ్రైవర్ల సమయం, ఇంధనం వృథా అవుతోందని పేర్కొంటూ, క్యాన్సిలేషన్ ఛార్జీలను తప్పనిసరిగా డ్రైవర్ ఖాతాలో నేరుగా జమ చేయాలని, పదే పదే క్యాన్సిల్ చేసే కస్టమర్లపై చర్యలు తీసుకోవాలని కోరింది.
అన్యాయ పెనాల్టీలు, అకౌంట్ బ్లాకింగ్ నిలిపివేయాలి:
సరైన విచారణ లేకుండా డ్రైవర్ల అకౌంట్లను సస్పెండ్ చేయడం అన్యాయమని యూనియన్ పేర్కొంది. అకౌంట్ బ్లాక్ చేసే ముందు నోటీసు ఇవ్వడంతో పాటు, ఆధారాలు చూపించి డ్రైవర్‌కు వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని, పారదర్శక గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఇంధన వ్యయ సర్దుబాటు, టోల్ రీయింబర్స్‌మెంట్:
డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని పేర్కొంటూ, ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (FCA) అమలు చేయాలని, టోల్ ఛార్జీలను యాప్ ద్వారానే వెంటనే రీయింబర్స్ చేయాలని కోరింది.
వేటింగ్ టైమ్ ఛార్జీలు:
పికప్ లొకేషన్ వద్ద ఎక్కువసేపు వేచి ఉన్నా పారితోషికం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా వేటింగ్ ఛార్జీలు అమలు చేయాలని డిమాండ్ చేసింది.
డ్రైవర్ల భద్రత:
వేధింపులు, దుర్వ్యవహారం, అసురక్షిత పరిస్థితులు ఎదురవుతున్నాయని డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొంటూ, 100 శాతం వెరిఫైడ్ కస్టమర్ అకౌంట్లు, ప్రతీకార భయం లేకుండా ఫిర్యాదు చేసే వ్యవస్థ, 24/7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
బలవంతపు ట్రిప్ అంగీకారానికి బ్రేక్:
తక్కువ చార్జీలు లేదా దీర్ఘదూర ట్రిప్స్ తిరస్కరించినందుకు డ్రైవర్లపై ఒత్తిడి, పెనాల్టీలు విధించకూడదని, రేటింగ్ విధానం న్యాయంగా ఉండాలని యూనియన్ కోరింది.
స్టేక్‌హోల్డర్ సంప్రదింపులు:
డ్రైవర్లపై ప్రభావం చూపే విధాన మార్పులను యూనియన్‌తో చర్చించకుండా అమలు చేయడం అన్యాయమని పేర్కొంటూ, ప్రతి నెలా టిజిపిడబ్ల్యుయుతో సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.
ఏడు రోజుల్లో సమావేశం నిర్వహించాలి
పోర్టర్ డ్రైవర్ల జీవనోపాధి, గౌరవాన్ని కాపాడేందుకు ఏడు రోజుల్లోపు అధికారిక సమావేశం నిర్వహించాలి అని టిజిపిడబ్ల్యుయు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా టిజిపిడబ్ల్యుయు వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, “పోర్టర్ సంస్థ అభివృద్ధి పూర్తిగా డ్రైవర్ల కష్టంపై ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలు డ్రైవర్లను అప్పులు, అసురక్షిత పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి. ఇది కొనసాగనివ్వబోము” అని హెచ్చరించారు.
ఇక, ఈ సమస్యలను ప్రజాపాలన కార్యక్రమంలో కూడా ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్‌కు టిజిపిడబ్ల్యుయు ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని టిజిపిడబ్ల్యుయు హెచ్చరించింది.

