మహిళలకు నాలుగు శుభవార్తలు చెప్పిన రేవంత్ సర్కార్
‘మార్చి 12 వరకు ఆగితే తెలంగాణలోని మహిళలంతా మహాలక్ష్ములు అవుతారు’ ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.
‘మార్చి 12 వరకు ఆగితే తెలంగాణలోని మహిళలంతా మహాలక్ష్ములు అవుతారు’ ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య. తెలంగాణ మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తుందని రేవంత్ పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ మహిళల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని, వాటిలోని మహాలక్ష్మి పథకం విధి విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం నడుం బిగించిందని వెల్లడించారు సీఎం రేవంత్. మహిళల సాధికారతతో పాటు వారి భవిష్యత్ కోసం ఆర్థిక సహాయం అందించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ప్రకటించారు. తమ ప్రభుత్వ పాలనలో తెలంగాణ మహిళలు కోటీశ్వరులు అవుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు నాలుగు శుభవార్తలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. దాంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తాజాగా త్వరలోనే రాష్ట్రంలో మరికొన్ని పథకాలను కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం రాష్ట్ర మహిళలు ఈ నెల 12 తేదీ వరకు వేచి చూడాలంటూ మహిళలకు సీఎం రేవంత్ నాలుగు శుభ వార్తలు చెప్పారు.
రూ.500కే గ్యాస్ సిలెండర్‌ను అందించడాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళలు గ్యాస్ సిలెండర్‌కు రూ.955 చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత రూ.455 సబ్సిడీ వారి ఖాతాల్లో పడతాయని అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లోనే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని, అందుకోసం ఇప్పటికే తమ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని, ఈ పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్నవారికి సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామని, దీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
త్వరలోనే కళ్యాణ లక్ష్మి
మహిళల సాధికారత కోసం త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని, ఈ పథకం కింద ప్రస్తుతం అమలులో ఉన్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో అందిస్తున్న సేవలకు అదనంగా మరికొన్ని ప్రయోజనాలను కలపనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం అందిస్తామని చెప్పారు.
ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్‌లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాలపై తుది నిర్ణయం తీసుకుని వెల్లడించనున్నారు. ఈ భేటీలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్తులను పునఃపరిశీలించి మరోసారి గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. ఈ పథకాలతో పాటు త్వరలోనే అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.