తిరుమలపై కన్నేసిన తెలంగాణ
x
Tirumala temple

తిరుమలపై కన్నేసిన తెలంగాణ

తెలంగాణా ప్రభుత్వం విభజన సమస్యలతో పాటు కొన్ని గొంతెమ్మకోరికలను కూడా కోరుతున్నట్లు సమాచారం. ఈ గొంతెమ్మకోరికలు ఎప్పటికీ తీరేవి కావు.


విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం సాయంత్రం తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకు జరగబోయే సమావేశానికి ఉన్నతాధికారులు అన్నీ ఏర్పాట్లుచేశారు. 2014 రాష్ట్రపునర్వ్యస్ధీరకరణ చట్టం ప్రకారం చర్చించాల్సిన, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వివాదాలపై సీఎంలు చర్చిస్తారు. మొదటి మీటింగులోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే సమస్యల పరిష్కారం కోసం కూర్చుని మాట్లాడుకోవటమే ముఖ్యం. అయితే తెలంగాణా ప్రభుత్వం విభజన సమస్యలతో పాటు కొన్ని గొంతెమ్మకోరికలను కూడా కోరుతున్నట్లు సమాచారం. ఈ గొంతెమ్మకోరికలు ఎప్పటికీ తీరేవి కావు.

నిజానికి సీఎంల మధ్య చర్చకు రావాల్సిన సమస్యల్లో ముఖ్యమైనవి షెడ్యూల్ 9, 10 ప్రకారం విభజన జరగాల్సిన కేంద్ర, రాష్టప్రభుత్వ సంస్ధలు. విద్యుత్ బకాయాల చెల్లింపు, నదీజలాల వాటాను పంచుకోవటం, ఢిల్లీలోని ఆస్తుల పంపిణీ, ఏపీలో కలిపిన తెలంగాణా 7 మండలాలను తిరిగి కావాలని తెలంగాణా ప్రభుత్వం డిమాండ్, హైదరాబాద్ లోని భవనాల బదలాయింపు, ఉమ్మడి సంస్ధల ఖాతాల్లోని సుమారు రు. 8 వేల కోట్లను పంచుకోవటం లాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ విభజన చట్టం ప్రకారం ఎప్పుడో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలు. ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన వాళ్ళ వైఖరి కారణంగానే సమస్యలు పరిష్కారం కాలేదు.

ఈ సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు భేటీ అయినా ప్రాబ్లెంలేదు. కాని వీటికి అదనంగా తెలంగాణా ప్రభుత్వం విచిత్రమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. అవేమిటంటే శ్రీవారు కొలువైన తిరుమలలో వాటా కోరుతోంది. తిరుమల భూభాగంతో పాటు ఆలయంలో కూడా 42 శాతం వాటా కోరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. 42 శాతం ఏమిటంటే విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా ఆస్తులు, అప్పులను ఏపీకి 58 శాతం, తెలంగాణాకు 42 శాతం చొప్పున పంచుకోవాలని విభజన చట్టం చెప్పింది. దాని ప్రకారం ఇపుడు సమస్యల పరిష్కారంలో భాగంగా తిరుమలలో కూడా తెలంగాణా ప్రభుత్వం 42 శాతం వాటా కోరుతోంది. విభజన చట్టం ప్రకారం తిరుమల భూభాగంతో పాటు వెంకన్న ఆలయ వ్యవహారాల్లో కూడా తమకు వాటా దక్కాలని తెలంగాణా ప్రభుత్వం డిమాండ్ చేయబోతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు తిరుమలలో వాటా కావాలని తెలంగాణా ప్రభుత్వం డిమాండ్ చేస్తుండటం చాలా అన్యాయమనే చెప్పాలి. భక్తులు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిని కూడా వాటాలు వేసి పంచాలనే తెలంగాణా ప్రభుత్వ డిమాండును భక్తులు తట్టుకోలేకపోతున్నారు.

అలాగే ఏపీకి సుమారు వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతముంది. చాలా ఓడరేవులున్న కారణంగా ఏపీ ప్రభుత్వం సముద్ర తీరాన్ని అభివృద్ధిచేసుకుంటోంది. తెలంగాణా ప్రభుత్వానికి దీనిపైన కూడా కన్నుపడింది. తెలంగాణాలో సముద్రతీరం లేదుకాబట్టి కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో శాశ్వత వాటా కోరుతోంది. నిజానికి పోర్టుల వాడకంపై విభజన చట్టంలో స్పష్టతుంది. అవసరానికి పోర్టులను వాడుకోవాలంటే నిర్దిష్ట ఫీజులను చెల్లించి వాడుకోవచ్చని ఉంది. అయితే ఇపుడు తెలంగాణా ప్రభుత్వం మాత్రం పై మూడుపోర్టుల్లోను శాశ్వాత వాటా కోరుతోంది. ఏరకంగా చూసినా ఇది సాధ్యంకాని వ్యవహారం. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం వాటా కోరితే తెలంగాణా ప్రభుత్వం ఇస్తుందా అన్న ప్రశ్న జనాలనుండి మొదలైంది. విభజనలో భాగంగా తెలంగాణాలోని ఏడు మండలాలు ఏపీలో కలిసిపోయాయి. చింతూరు, వీఆర్ పురం, కూనవరం, భద్రాచలం (గ్రామపంచాయితి మినహా) వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు(పాక్షికం) మండలాలను ఏపీలో కలిపితే కాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యంకాదు. అందుకనే పై ఏడు మండలాలు విభజన చట్టంప్రకారం ఏపీలోకలిపాయి. అలాంటిది ఇపుడు కొత్తగా తెలంగాణా ప్రభుత్వం ఏడు మండలాలను తమకు వెనక్కు ఇచ్చేయమని అడుగుతోంది. ఇలాంటి గొంతెమ్మ కోరికల పరిష్కారంతో భేటీలు జరిగితే సమస్యలు ఎప్పటికైనా పరిష్కారమవుతాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి సాయంత్రం భేటీలో ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story