మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్
తెలంగాణలో మహిళా సంఘాలు ఆర్ధికంగా లాభపడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సేవ, మీ సేవ పేరుతో కేంద్రాలను మంజూరు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రజలకు మీ సేవ ద్వారా ఆన్లైన్ సేవలు అందడంతో పాటు వాటి నిర్వహణ ద్వారా మహిళా సంఘాలు కూడా ఆర్థికంగా లాభం పొందుతాయని ప్రభుత్వం యోచిస్తోంది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 4525 మీసేవ కేంద్రాలు ఉండగా... వీటిలో మూడు వేల వరకు పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. పన్నెండు వేలకు పైగా పంచాయతీలు ఉంటే.. కేవలం వెయ్యి గ్రామాల్లోనే మీ సేవ కేంద్రాలున్నాయి. ఈ సేవ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్న పనులకు కూడా ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది.
ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఈ సేవ, మీ సేవ కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించింది. గ్రామాల్లో మీ సేవ కేంద్రాలు పెట్టుకునేందుకు స్వయం సహాయ సంఘాలకు రెండున్నర లక్షల వరకూ రుణం కూడా అందించనుంది. ఈ రుణాలతో ఈ సేవ కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలను కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తారు కాబట్టి.. ఆ కేంద్రాలకు అవసరమైన స్థలం కూడా ప్రభుత్వ భవనాలలోనే లభ్యతను బట్టి కేటాయించే ఛాన్స్ ఉంది. ఇంటర్ పాసైన వారిని ఆపరేటర్లుగా పని చేసేందుకు శిక్షణ ఇప్పిస్తారు. మీ సేవ అధికారుల పర్యవేక్షణలో ఇవి పని చేస్తాయి. మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. పంద్రాగస్టు నాటికి గ్రామాల్లో మీసేవ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం ఇటీవల మహిళాశక్తి క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.