
బస్సులో ప్రయాణించిన వారి వివరాలివేనా ?
చనిపోయిన వారిలో అత్యదికులు హైదరాబాదుకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం
కర్నూలులో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో బాధితులను ఆదుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటుచేసింది. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గురువారంరాత్రి హైదరాబాద్ నుండి బెంగుళూరుకు బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గరకు చేరుకున్న తర్వాత చిన్నటేకూరు దగ్గర అగ్నిప్రమాదానికి గురయ్యింది. ఈ బస్సులో 42 మంది ప్రయాణిస్తుండగా సుమారు 22 మంది సజీవదహనం అయ్యారని అధికారవర్గాల సమాచారం. ఎంతమంది చనిపోయారనే విషయంలో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రమాదంలో నుండి సుమారు 15 మంది బయటపడినట్లు సమాచారం. బస్సు-మోటారుసైకిల్ ఢీ కొనటంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదం గురించి తెలియగానే ఏపీలోని కర్నూలు కలెక్టర్, ఎస్పీ, కర్నూలు రేంజి ఐజీతో పాటు వైద్యాధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయకచర్యలు చేస్తున్నారు. గాయపడినవారిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కర్నూలుకు దగ్గరగా తెలంగాణలోని గద్వాల కలెక్టర్, ఎస్పీ, వైద్యాధికారులను వెంటనే ప్రమాదస్ధలానికి చేరుకోవాలని రేవంత్ ఆదేశించారు. బాదితులకు అవసరమైన సాయం అందించాలని ఉన్నతాధికారులకు రేవంత్ చెప్పారు. మృతులను గుర్తించటంతో పాటు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించటం, గాయపడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న వారికి అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేవంత్ ఆదేశాలతో తెలంగాణలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు.
బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారని తెలుసుకునేందుకు అధికారులు ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికి కొంతమంది వివరాలు మాత్రమే తెలిశాయి. టికెట్లు బుక్ చేసిన పటాన్ చెరు, లక్డీకాపూల్ బుకింగ్ ఆఫీసులను యాజమాన్యం మూసేసింది. యాజమాన్యం ఫోన్లో కూడా ఎవరికీ అందుబాటులోకి రావటంలేదు. చనిపోయిన వారిలో ఇప్పటికి 11 మందిని యంత్రాంగం గుర్తించిం డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. చనిపోయిన వారిలో అత్యదికులు హైదరాబాదుకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం. మీడియాలో బస్సు ప్రయాణీకుల వివరాలంటు ఒక జాబితా సర్క్యులేషన్లో ఉంది. ఈ జాబితాను ట్రావెల్స్ యాజమాన్యమే నిర్ధారించాలి.
ప్రమాదం గురించి తెలుసుకున్న బస్సులో ప్రయాణించిన వారి బంధువులు ఒక్కొక్కరే ప్రమాదస్ధలానికి, కర్నూలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వీరిద్వారానే బస్సులోని ప్రయాణీకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

