డ్రగ్స్ కట్టడికి సర్కార్ సరికొత్త వ్యూహం... స్కూళ్లలో ప్రహరీ క్లబ్స్
డ్రగ్స్ రహిత తెలంగాణ తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
డ్రగ్స్ రహిత తెలంగాణ తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్స్ కి గంజాయి, డ్రగ్స్ ప్రధాన కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. స్కూల్ విద్యార్థులు కూడా మాదకద్రవ్యాలను వాడుతున్నారని ఇటీవల జరిగిన కొన్ని ఘటనల్లో వెల్లడైంది. దీంతో మొక్క దశ నుంచే డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం దృష్టి టీయూకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ శుక్రవారం కీలక జీవో విడుదల చేసింది.
పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చుట్టుపక్కల పాఠశాలల్లో డ్రగ్స్ అమ్మకాలను ఆపడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగం నుండి పిల్లలను దూరం చేయడం ఈ క్లబ్‌ల ఏర్పాటు లక్ష్యం. శుక్రవారం విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, క్లబ్‌లకు స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ నేతృత్వం వహిస్తారు. సీనియర్ ఉపాధ్యాయుడు లేదా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారు. 6 నుండి 10వ తరగతి వరకు తరగతికి ఇద్దరు విద్యార్థులు, ఒక పేరెంట్, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.
డ్రగ్స్ తీసుకునే పిల్లలు... స్కూల్ ఆవరణలో, చుట్టుపక్కల డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాల అమ్మకం వంటి అనుమానిత కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ క్లబ్స్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్లబ్ లకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్లబ్స్ నిర్వహణలో పోలీసు శాఖ, NSS వలంటీర్లతో సన్నిహిత సహకారంతో పని చేస్తుంది.