
మూసీ వరదపై ఫుల్ ఫోకస్.. ఎక్కడిక్కడ భద్రతా చర్యలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు.
హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరమంతా జలదిగ్భందమైంది. కొన్ని ప్రాంతాలయితే నదులను తలపిస్తున్నాయి. బయటకు వచ్చేందుకు కూడా వీలులేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హైడ్రా, ఎస్‌డీఆర్ఎఫ్ వంటి సహాయక బృందాలు రంగంలోకి దిగి.. ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల వారిని కూడా పునరావాస కేంద్రాలను తరలిస్తున్నాయి. భారీ వర్షాలు ,వరదలతో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు.
బస్ రూట్లకు ప్రత్యామ్నాయాలు చూశాం..
రాత్రి ఒక్కసారిగా చాదర్ఘాట్ బ్రిడ్జి పై నుండి వరద పెరగడం, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో వరద ప్రవాహం పెరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీ,పోలీస్, హైడ్రా, ట్రాఫిక్,వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఎంజీబీఎస్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ రూట్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ ,దసరా పండుగ లకు వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు వరదవైపు ఎవరు రాకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మూసి పరివాహం వెంట ప్రధాన రహదారులపై భద్రత ను పెంచాలని నగర పోలీసులకు సూచించారు.
పునరావాస కేంద్రాల వివరాలివే..
జీహెచ్‌హెచ్ తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు శంకర్ నగర్ ప్రాంతంలోని దాదాపు 500 మంది నిర్వాసితులు షాజాదీ మసీదులో వసతి పొందుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పునరావాసం లో వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మలక్‌పేట్ సర్కిల్‌లోని మూసా నగర్ కమ్యూనిటీ హాల్ లో 150 మంది వసతి పొందుతున్నారు. దుర్గా నగర్ , అంబేద్కర్ నగర్ నిర్వాసితులు దాదాపు 45 కుటుంబాలు మూసారాంబాగ్ వంతెనకు సమీపంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి పొందుతున్నారు. దుర్గానగర్‌లోని 21 కుటుంబాలు భద్రత కోసం పై అంతస్తులకు మారాయి. గోల్నాక కమేలా సమీపంలోని కృష్ణ నగర్ నివాసితులైన 32 మందిని కృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. వారికి ఆహారపదార్థాలు అందిస్తున్నారు. భూ లక్ష్మీ ఆలయం నుండి 55 మందిని సురక్షిత ప్రదేశమైన గోడే-కి-ఖబర్ జిహెచ్‌ఎంసి కమ్యూనిటీ హాల్‌కు తరలించారు... పునరాగం కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారనీ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్
వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీ కి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరివాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘‘మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలి’’ అని సూచించారు. అర్ధరాత్రి ఇమ్లిబన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్ హైడ్రా, జీ ఎచ్ ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.