రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
x

రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోన్న విషయం తెలిసిందే.


తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కీలక విషయం వెల్లడించింది. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

నిధుల సమీకరణ కూడా మొదలుపెట్టినట్టు మంత్రి వెల్లడించారు. రేపటి నుంచి రైతు భరోసాపై ఖమ్మంలో అభిప్రాయం సేకరణ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. కాగా, గతంలో అనేక మంది ప్రజా ప్రతినిధులు రైతు బంధు చెక్కులు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి రైతుబంధు చెక్కులు తీసుకోవడంపై స్పందిస్తూ... నేను ఇంత వరకు రైతుబంధు తీసుకోలేదు, చెక్ లు ఇచ్చినా తిరిగి ఇచ్చానని చెప్పారు.

మంత్రి జిల్లాలో రైతుల వరుస ఆత్మహత్యలు...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత జిల్లాలో రైతుల వరుస ఆత్మహత్యాయత్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మంగళవారం మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రఘునాథ్ పల్లి మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన రైతు ప్రసాద్ (32) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాము సుమారు 15 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో కానిస్టేబుల్ తన కూతురు పేరుమీద అక్రమంగా పట్టా తీసుకున్నాడని రైతు ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సోమవారం ఖమ్మం - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన పిట్టల లక్ష్మయ్య పంటకి గిట్టుబడి రాక, సాగు కోసం తీసుకున్న అప్పు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మరణించారు.

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల తన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.

Read More
Next Story