
పంచాయతీ ఎన్నికలపై రిలీజయిన జీవో..
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై విధివిధానాలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ జీవోను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కులగణన ఆధారంగా సర్పంచ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. ఇక మహిళా రిజర్వేషన్లు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ రూపంలో ఖరారు చేయనున్నారు. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై డెడికేటెడ్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.
రిజర్వేషన్లు 50శాతం మించకూడదు
పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలుపుకుని 50శాతం మించకూడదని సిఫార్సు చేసింది కమిషన్. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 24న హైకోర్టులో జరగనున్న హైకోర్టు విచారణకు ముందే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 24-25 తేదీల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

