కాళేశ్వరం పునరుద్దరణకు ప్రభుత్వం నోటిఫికేషన్
x

కాళేశ్వరం పునరుద్దరణకు ప్రభుత్వం నోటిఫికేషన్

అక్టోబర్ 15న మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్.


కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రిపేర్ చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల పునరుద్దరణ డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(EOI) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ.. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిజైన్లను ఎన్‌డీఏ దర్యాప్తు ఆధారంగా రూపొందించాలని స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు అక్టోబర్ 15న మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం. అందిన దరఖాస్తులను అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరిశీలించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ డిజైన్లను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో భద్రపరచనుంది.

డిజైన్ల కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని నీటిపారుదల శాఖ.. సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించడానికి అధికారులు అవకాశం కల్పించారు.

కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లోభాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగాయి. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడ్డాయి. ఈ ప్రాజెక్ట్‌ల పునరుద్దరణకు ఎన్‌డీఎస్‌ఏ సహాయం కోరగా.. ఎన్‌డీఎస్‌ఏ పలు కీలక సూచనలు చేసింది. వాటిని పరిగణనలోని తీసుకునే బ్యారేజీల పునరుద్దరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యారేజీల డిజైన్లను తొలుత ఐఐటీ రూర్కీ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావించింది. ఆ తర్వాత పునరాలోచనలో పడ్డారు అధికారులు. పిల్లర్స్ కుంగినప్పుడు అక్కడ పరిస్థితిని నిర్మాణ సంస్థ ఎల్‌ఎండ్‌టీ, ఐఐటీ రూర్కీతోనే అధ్యయనం చేయించడం జరిగింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను ఎన్డీఎస్‌ఏ నిరాకరించింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ సంస్థ నుంచే డిజైన్లు తీసుకుంటే ఎన్‌డీఎస్‌ఏ ఏమాత్రం అనుమతిస్తుందో తెలీదు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి.. డిజైన్ల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది.

Read More
Next Story