ఐఏఎస్ లకు బైబై చెప్పేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణాలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బాధ్యతల నుండి రిలీవ్ చేసినట్లు సమాచారం. ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఒకవైపు అఖిలభారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల న్యాయపోరాటం ముగియకముందే తెలంగాణా ప్రభుత్వం అందరికీ గుడ్ బై చెప్పేసింది. తెలంగాణాలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులను తెలంగాణా ప్రభుత్వం బాధ్యతల నుండి రిలీవ్ చేసినట్లు సమాచారం. వెంటనే వెళ్ళి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అందుబాటులోని సమాచారం ప్రకారం వీళ్ళందరినీ తెలంగాణా ప్రభుత్వం నాలుగురోజుల క్రితమే రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే రిలీవ్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఎప్పుడైతే తమ కేటాయింపులపై కేసులు వేసిన ఐఏఎస్ లకు మంగళవారం సాయంత్రం చుక్కెదురయ్యిందో రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎనిమిదిమందిని రిలీవ్ చేసిన విషయం బయటపడింది. తెలంగాణాలో పనిచేస్తున్న తమను డీవోపీటీ ఏపీకి కేటాయించటాన్ని సవాలు చేస్తు ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, జీ సృజన(ఏపీ) క్యాట్ లో వేర్వేరుగా కేసులు వేసిన విషయం తెలిసిందే.
రెండువైపుల వాదనలు విన్న క్యాట్ ఐఏఎస్ లకు ఫుల్లుగా క్లాసు పీకింది. ఇంట్లో కూర్చుని పనులు చేస్తామంటే ఎలాగంటు నిలదీసింది. విజయవాడలో తుపాను వల్ల జనాలు అల్లాడుతుంటే సేవలు చేయటానికి ఎందుకు ఇష్టపడటంలేదని నిలదీసింది. అఖిల భారత సర్వీసు అధికారులను ఎక్కడ పనిచేయించుకోవాలనే అధికారం డీవోపీటీకి ఉందని స్పష్టంగా చెప్పింది. డీవోపీటీ ఆదేశించినట్లు ఏపీకి వెళ్ళి రిపోర్టు చేయాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అయితే క్యాట్ తీర్పును బుధవారం హైకోర్టులో చాలెంజ్ చేయనున్నట్లు ఐఏఎస్ తరపు లాయర్లు మీడియాకు మంగళవారం సాయంత్రం చెప్పారు. ఈ వివాదం ఇలాగుండగానే మంగళవారం రాత్రి ఐఏఎస్+ఐపీఎస్ అధికారులను నాలుగురోజుల క్రితమే తెలంగాణా ప్రభుత్వం రిలీవ్ చేసిన విషయం పొద్దుపోయిన తర్వాత బయటపడింది.
క్యాట్ తీర్పు నేపధ్యంలోనే తెలంగాణా ప్రభుత్వం ఎనిమిదిమంది అధికారులను రిలీవ్ చేసిన ఉత్తర్వులు బయటపడ్డాయని సమాచారం. ఆ ఉత్తర్వుల్లో వెంటనే వెళ్ళి ఏపీలో రిపోర్టు చేయాలనుందని సమాచారం. అంటే ఇంతకాలం తెలంగాణాలో పనిచేసిన అఖిల భారత సర్వీసు అధికారుల సేవలను తెలంగాణాలోనే వాడుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నంచేసే ఉద్దేశ్యంలో ఏమాత్రం లేదన్న విషయం బయటపడింది. తాజా పరిణామాల నేపధ్యంలో ఐఏఎస్ అధికారులు కాటా అమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఏస్ అధికారులు అంజనీకుమార్, అభిలాషా బిస్త్, అభిషేక్ మహంతి ఏపీలో బుధవారం రిపోర్టు చేయాల్సిందే.
ఇదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న జీ సృజన, తోలేటి శివశంకర్, సీ హరికిరణ్ వెంటనే తెలంగాణాలో రిపోర్టు చేయాల్సుంటుంది. క్యాట్ లో కేసు వేసిన ఐదుగురికి ఊరట దక్కలేదు కాబట్టి మిగిలిన ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు చేయక వేరే ఆప్షన్ లేకపోయింది. క్యాట్ లో ఎదురుదెబ్బతిన్న ఐఏఎస్ లు హైకోర్టులో దాఖలు చేయబోతున్న రివ్యూ పిటీషన్ విచారణలో ఏమవుతుందో చూడాల్సిందే. కేసు దాఖలు చేయగానే హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణా, ఏపీలో రిపోర్టు చేయటానికి 16వ తేదీనే డెబ్ లైన్. డెడ్ లైనంటే సాయంత్రంలోగా రిపోర్టు చేయాల్సుంటుంది. క్యాట్ తీర్పును హైకోర్టులో చాలెంజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు కాబట్టి కేసు దాఖలుచేస్తే హైకోర్టు ఎలాగ స్పందిస్తుందో చూడాలి. కేసు దాఖలు తర్వాత పరిణామాలను చూసుకుని తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేస్తారా ? అన్నవిషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.