‘భూ భారతి’కి లైన్ క్లియర్.. త్వరలోనే అమలు
తెలంగాణలో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం భూ భారతి.
తెలంగాణలో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం భూ భారతి. గత ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల భూములను కాజేసిందని, ధరణి వచ్చిన తర్వాత భూమి ఉన్నవారికి దరిద్రం పట్టిందని కాంగ్రెస్ ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించింది. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తొలగిస్తామని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ వెల్లడించింది. అదే విధంగా ఇటీవల ధరణి అంశంపై అసెంబ్లీ చర్చ పెట్టి మరీ ఆ చట్టాన్ని తొలగించారు. దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని తెస్తామన్నారు. ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తాజాగా ‘భూ భారతి’ చట్టానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని, వాటిపై పూర్తి దృష్టి పెడతామని చెప్పారు. ఈ క్రమంలోనే భూ భారతి బిల్లు కాపీని మంత్రి పొంగులేటికి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం సచివాలయంలో అందించారు.
‘‘రెవెన్యూ చట్టం -2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కోన్నారు. భూ సమస్యలేని గ్రామం తెలంగాణలో లేదు. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్దను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది . గ్రామాలలో రెవెన్యూ పాలనను చూడడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కివచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది.ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలి, రెవెన్యూ వ్యవస్దను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష. ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా మా ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయాలి’’ అని తెలిపారు మంత్రి.
ఇదిలా ఉంటే అసెంబ్లీ వేదికగా ‘భూ భారతి’ బిల్లు చర్చలో భాగంగా ‘ధరణి’ పోర్టల్‌పై సీఎం రేవంత్ ఘాటుగైన వ్యాఖ్యలు చేశారు. ‘ధరణి’ పేరుతో బీఆర్ఎస్ దగా చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా భావించే భూమినీ బీఆర్ఎస్ లాక్కునే ప్రయత్నాలు చేసిందని, ‘ధరణి’ వచ్చిన తర్వాతే అసలు భూ ఆక్రమణలు అధికమయ్యాయని, ‘ధరణి’ నిర్వహణకు గాలికొదిలేశారని ఆరోపించారు. అసలు ఈ పోర్టల్‌ను గత పాలకులు నేర చరిత్ర ఉన్న సంస్థలకు అప్పగించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ‘‘తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. ఆ భూమిని కాపాడుకోవడం కోసం దొడ్డి కొమరయ్య వంటి వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడటం కోసం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. భూమిలేని పేదలకు ఇందిరా గాంధీ.. ప్రభుత్వ భూమి ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడటం కోసం గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. అదే పేరుతో బీఆర్ఎస్ మాత్రం దగా చేయడానికే ‘ధరణి’ పోర్టల్ తెచ్చింది. ‘ధరణి’ రైతులకు తమ భూములకు దూరం చేసింది’’ అని రేవంత్ మండిపడ్డారు.
‘‘2010లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరణి విధానాన్ని అనుసరించింది. అప్పుడు ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసీ, కాగ్ సూచించాయి. అనుభవం లేని ఐ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థకు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను ఐఎల్ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేకోవర్ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారు’’ అని చెప్పారు రేవంత్. ‘‘ధరణి టెండర్ దక్కిన వెంటనే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారింది. ఫాల్కన్ హెచ్‌బీ అనే ఫిలిప్పీన్ సంస్థ, సింగపూర్‌కు చెందిన మరో కంపెనీ ఇందులోకి ఎంట్రీ ఇచ్చాయి. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్ హెవెన్ దేశా కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్‌ను పెట్టారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా.. సీఈవోగా గాదె శ్రీధర్‌రాజే ఉన్నారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.