తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 షురూ
x

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 షురూ

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహస్తున్న సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్.


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సదస్సు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ రెండు రోజుల సమిట్‌ (సోమ, మంగళ)కు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు రాగా, దేశ–విదేశాల నుంచి సుమారు 2,000 మంది అతిథులు హాజరుకావడంతో అత్యాధునిక వసతులు, కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్టాళ్ల సందర్శన, సూచనలు చేసిన సీఎం

సదస్సు ప్రారంభానికి ముందే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాంగణానికి చేరుకుని ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వివిధ విభాగాల ప్రదర్శనలు, సాంకేతిక విభాగాలు, డెవలప్మెంట్‌ మోడళ్లను పరిశీలించిన ఆయన అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

తెలంగాణ తల్లి డిజిటల్‌ విగ్రహం ఆవిష్కరణ

సమిట్‌ సందర్భంగా సీఎం తెలంగాణ తల్లి డిజిటల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచం ముందు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కొత్త రూపంలో చూపించే ప్రయత్నంగా దీనిని రూపొందించారు.

పెట్టుబడుల అవకాశాలపై సీఎం కీలక ప్రసంగం

సమిట్‌లో ప్రధానంగా

తెలంగాణలో ప్రజాపాలన విధానాలు

పెట్టుబడుల అవకాశాలు

ప్రభుత్వం అందించే సపోర్ట్‌

విజన్‌ 2047 లక్ష్యాలు

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళిక

వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించనున్నారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా అభివృద్ధి చేయడం ఈ సమిట్‌ ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక సందర్భంగా భావిస్తున్న ఈ సమిట్‌ ద్వారా పలు సంస్థలతో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఫ్యూచర్‌ సిటీ అంతర్జాతీయ అతిథులతో సందడిగా మారనుంది.

Read More
Next Story