‘ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే’.. రవాణా శాఖలో కీలక మార్పులు
x

‘ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే’.. రవాణా శాఖలో కీలక మార్పులు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎవరైనా రూల్స్ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.


తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎవరైనా రూల్స్ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. రవాణా శాఖలో తమ ప్రభుత్వం రెండు మూడు సరికొత్త సంస్కరణలు తీసుకురానుందని, వీటితో రాష్ట్రంలో చాలా మార్పులు రానున్నాయని ఆయన వివరించారు. మోటారు వాహన చట్టంలో భాగంగా ఇప్పటికే 28 రాష్ట్రాలు సారధి వాహన్ పోర్టల్ వినియోగిస్తున్నాయని, అమలు చేస్తున్నాయని చెప్పారాయన. కాగా తెలంగాణలో ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు సమస్య వస్తుందని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలపై ఆయన ఈరోజు క్షేత్రస్థాయి ఆర్టీవో, డీటీఓలతో సమావేశమై చర్చించారు. తెలంగాణలో కూడా సారధి వాహన్ పోర్టల్‌లో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో అతి త్వరలోనే అనేక ఇంటర్ స్టేట్ రిలేషన్ సమస్యలకు చెక్ పెట్టడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీఓ 28 ద్వారా దీనిని అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటుగా వాహనాల స్క్రాపింగ్ పాలసీ గురించి కూడా కీలక ప్రకటన చేశారు. లైఫ్‌టైమ్ నిండిన వాహనాల కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నామని ఆయన వివరించారు. దేశంలో, రాష్ట్రంలో వాహనాలకు సంబంధించి ప్రజలు వాడే వాహనాలు 15 ఏళ్లకు, ప్రైవేట్ వాహనాలకు 8 సంవత్సరాల పాలసీని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఎవరికైనా రూల్స్ ఒకటే..

‘‘ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో కనీసం ఒక్కరైనా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు రక్షించాలన్న ఉద్దేవంతోనే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందే అవకాశం ఉండదు. అంతేకాకుండా వాహనాలు కొనుగోలు చేసిన.. వాటిని వారి పేరుపై నమోదు చేసుకునే అవకాశం కూడా ఉండదు. ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం, ట్రాఫిక్స్ రూల్స్‌పై పిల్లల నుంచే అవగాహన ఇప్పించాలి. ఎవరూ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వాహనాలు, ఆర్‌టీసీ బస్సులు, టూ వీలర్స్ వాహనం ఏదైనా ట్రాఫిక్ రూల్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తాయి. అన్నింటికీ రూల్స్ వర్తిస్తాయి కూడా’’ అని స్పష్టం చేశారు.

కొత్తగా 113 మంది ఇన్‌స్పెక్టర్లు

ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసమే అతి త్వరలో 113 మంది ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు నియామకాలు పూర్తి చేసుకుని విధుల్లో అడుగుపెట్టనున్నారని కూడా వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల సేవలను మరింత ప్రభావ వంతంగా వినియోగించుకుంటామని, జీహెచ్ఎంసీలో ఉన్న ఏ వాహనమయినా రూల్స్ తప్పకుండా పాటించాలని అన్నారాయన. ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలను కంపల్సరీగా వర్తింపజేస్తామని చెప్పారు. ‘‘పక్క రాష్ట్రాల వాహనాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తారు. టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు.. టీఎస్ వాహనాలు మళ్ళీ టీజీకి మారుతాయని చెప్పలేదు. కొత్త వాహనాలు మాత్రమే టీజీగా వస్తాయి. నిబంధనలు ఉల్లంఘించి వాహనాల లైసెన్సు రద్దయితే వాళ్లు మళ్ళీ వాహనాలు కొనుగోలు చేయడానికి ఉండదు. ఈ మేరకు కేవలం రవాణా శాఖ నుంచే కాకుండా యూనిసెఫ్ వారి సహకారంతో కూడా అవగాహన కల్పిస్తున్నాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

అన్నీ పరిశీలించే కొత్త జీవో

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాతనే ఈ కొత్త జీవో 28ను తీసుకురావడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘‘వాహన తనిఖీలు సరైన పద్దతిలో జరగడం లేదని కేంద్రంతో మాట్లాడి ఆటోమోటివ్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం. ఒక్కో సెంటర్‌కు రూ.8 కట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 30 సెంటర్లలో వీటిని తీసుకురానున్నాం. దేశవ్యాప్తంగా ఏడాదికి 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగానే ఉంది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఈ కొత్త నిబంధనలు తెలస్తున్నాం. రోడ్డు భద్రతపై ప్రభుత్వంతో పాటు యునిసెఫ్ సహకారంతో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి పాఠశాలలో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పిస్తున్నాం. వచ్చే నెలలో రోడ్ సేఫ్టీ మంత్ ఉంది. సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ ఇతర అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నాం. ఇప్పటి వరకు 8 వేల లైసెన్స్‌లు రద్దయ్యాయి’’ అని వెల్లడించారు.

Read More
Next Story