Metro
x

ఈ ప్రాంతాలకి కూడా మెట్రో.. సర్కార్ నయా డెసిషన్

హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని నియోపోలిస్‌కు చేరుకునేలా మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించింది.


హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని నియోపోలిస్‌కు చేరుకునేలా మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించింది. ఐదు కారిడార్లలో విస్తరించి ఉన్న ప్రతిపాదిత కారిడార్ల మొత్తం దూరం 70 కి.మీ నుండి 78.4 కి.మీకి పెరిగింది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా రూ.24,042 కోట్లకు పెరిగింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో "ప్రభుత్వం కొత్త సూచనలను పొందుపరిచి, రెండవ దశ కోసం ప్రారంభ ప్రతిపాదనలను సమీక్షించి, సవరించిందని" పేర్కొన్నారు.

రాయదుర్గం నుండి విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లోని యుఎస్ కాన్సులేట్ వరకు మెట్రో లైన్ పొడిగించడం ముఖ్యమైన మార్పులలో ఒకటి. వాస్తవానికి, ఈ మార్గం 8 కి.మీ పొడవు ఉండగా, ఇప్పుడు దీనిని కోకాపేటలోని నియోపోలిస్ వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఈ మెట్రో లైన్ లో అదనంగా 3.3 కి.మీ. మెట్రో రూట్ పెరిగింది. దీంతో అంచనాలు కూడా పెరిగాయి. ఈ ప్రాంతంలో మెట్రో డిపో ఏర్పాటుకు అనువైన భూమిని అధికారులు ఇప్పటికే పరిశీలించారు.

మరో గుర్తించదగిన మార్పు ఏంటంటే... ఎయిర్‌ పోర్ట్ మెట్రో కారిడార్ ఇప్పుడు 29 కి.మీ పొడవుగా అంచనా వేయబడింది. ఇది నాగోల్, ఎల్‌బి నగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌ దేవ్‌ పల్లి కూడలి నుండి మొదలై జల్‌ పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని 4 కిలోమీటర్ల మేర పెంచారు. అదనంగా, మైలార్‌ దేవ్‌ పల్లి నుండి ఆరామ్‌ ఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కి.మీ మెట్రో మార్గం రెండవ దశలో ప్రతిపాదించబడింది. నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ ఛేంజ్ స్టేషన్‌ లుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మార్పులే కాకుండా ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, మియాపూర్‌-పటాన్‌ చెరు, ఫలక్‌ నుమా-చంద్రాయణగుట్ట కారిడార్లలో ఎలాంటి మార్పు ఉండదు.

Read More
Next Story