గురుకులాలపై సర్కార్ గురి.. ఉద్యోగం హామీ ఇచ్చిన భట్టి
x

గురుకులాలపై సర్కార్ గురి.. ఉద్యోగం హామీ ఇచ్చిన భట్టి

గురుకులాల పరిస్థితిపై రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల రీత్యా ప్రభుత్వం అప్రమత్తమైంది.


తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో పనితీరు, పరిశుభ్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కనీస వసతులు కూడా కరువయ్యాయని విలపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వివిధ ఘటనల్లో విద్యార్థులు చనిపోవటం తల్లిదండ్రులను తీవ్ర క్షోభకి గురి చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా గురుకులాల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని ఎడాపెడా వాయించేస్తున్నాయి. గురుకులాల్లో పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు బీఆర్ఎస్ సోమవారం ఒక ప్రకటన చేసింది. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టుంది. మంగళవారం ఉదయాన్నే మంత్రులు, అధికార యంత్రాంగం గురుకులాలను పర్యవేక్షించేందుకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

భట్టి, పొన్నం పరామర్శ..

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లితండ్రులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. కొడుకులను కోల్పోయిన ఘనాదిత్య, అనిరుధ్ తల్లిదండ్రులు మంత్రుల ముందు బోరున విలపించారు. అధికారులు నిర్లక్ష్యం మా పిల్లల పాలిట శాపంగా మారిందంటూ భట్టి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను మంత్రులు గురుకుల పాఠశాల ఇన్చార్జి మున్సిపల్ మహిపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం..

అంతకుముందు గురుకుల పాఠశాల హాస్టల్ పరిసరాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. జరిగిన ఘటనపై ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పాము కాటు వల్ల విద్యార్థి చనిపోయాడని భావిస్తున్న దృష్ట్యా అలాంటి ఘటన జరిగితే క్షణాల్లో వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల గురుకులాల్లో యాంటి వీనమ్, రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని కొంతమంది తమ దృష్టికి తీసుకువచ్చారని, అలా జరగడానికి వీల్లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురుకులాల్లో తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు.

చర్యలు చేపడతాం...

గురుకులాల్లో మెస్ ఛార్జీలు పెంచడం, భవనాలు నిర్మించడం, డైనింగ్ హాల్, బెడ్స్, ఫర్నీచర్ లాంటివి హాస్టళ్లలో ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార నాణ్యత, హాస్పిటల్, అవసరమైన సమయాల్లో చూసుకునేందుకు గురుకులాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా ఖమ్మం నుంచి ఇక్కడకు నేరుగా వచ్చినట్లు తెలిపారు. చిన్నారుల మృతి బాధాకరమన్నారు. వారి తల్లిదండ్రులను ఆదుకుంటామని చెప్పారు, చనిపోయిన పిల్లల కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని భట్టి విక్రమార్క ఇచ్చారు.

ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్...

తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచే పలు జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గురుకులాలలను నిర్వహిస్తే సిబ్బందిపై చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

మావల్ల మొద్దు నిద్ర వీడారు...

గురుకుల స్కూళ్లల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం సంతోషం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికైనా విద్యార్థులకు మెరుగైన విద్యా, భోజనం, వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్లు మొద్దునిద్రలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను మేల్కొనేలా చేసినందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.

అధ్యయన కమిటీ వేస్తామన్న కేటీఆర్...

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సోమవారం కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలిపారు. "ఈ 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 500 వందల పిల్లలు విషాహారం తిని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. మిగతా విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి. పిల్లలు బాగుండాలి, వారు ప్రపంచంతో పోటీపడే విధంగా చదువుకోవాలని మనం వెయ్యికి పైగా గురుకులాలు పెట్టుకున్నాం. వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. ప్రభుత్వం సంక్షేమ పాఠశాలు, సంక్షేమ వసతుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లితండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలి. ఈ విషయంలో మేము రాజకీయం చేయాలనుకోవటం లేదు.. ప్రభుత్వం బేషజాలకు పోవద్దు. గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన కమిటీ వేస్తున్నాం. ఒక 20 పాఠశాలలను పరిశీలించిన చేపట్టాల్సిన చర్యలను ఆయన ఐదారు రోజుల్లో నివేదిక ఇస్తారు" అని కేటీఆర్ ప్రకటించారు.


అప్రమత్తమైన సర్కార్?

గురుకులాల పరిస్థితిపై రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల రీత్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నాం అని ప్రకటించడం సర్కార్ కి అవమానకర విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థని తీర్చిదిద్దుతాం, నైపుణ్య వంతులుగా తీర్చి దిద్దుతం, ప్రభుత్వ విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువస్తాం అని చెప్పింది. ప్రభుత్వ బడుల్లో, సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు, పోషక ఆహరం కల్పిస్తాం అని ప్రకటనలు చేసింది. కానీ గురుకులాల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవడం, మృత్యువాత పడటం, కలుషిత ఆహారంపై ఆందోళనలు వ్యక్తం అవడంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడు తామే అధ్యయన కమిటీ వేస్తామని ముందుకొస్తే అది సర్కార్ ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడి వరకు పరిస్థితిని రానీయకుండా హుటాహుటిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Read More
Next Story