Kite Festival
x

తెలంగాణలో మిఠాయిల పండగ, ఎక్కడో తెలుసా?

1200 రకాల మిఠాయిలతో భారీగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.


తెలంగాణలో భారీ స్థాయిలో మిఠాయిల పండగ నిర్వహించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. ఈ మేరకు ఏర్పాట్లను శరవేగంగా చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా సింకింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో ఈ పండగ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

సాధారణంగా సంక్రాంతి అంటే రైతుల పండగ. పంట కోతను పూర్తి చేసి కొత్తగా వచ్చిన ధాన్యంతో సంక్రాంతి పండగను జరుపుకుంటారు. సంక్రాంతికి ముందు రోజు భోగి పండగ జరుపుకుంటారు. భోగి రోజున ఇంట్లోని పాత వస్తువులను తొలగించి.. వాటి స్థానంలో కొత్తవి తీసుకొస్తారు. ఆ పాత వస్తువులను భోగి పంటల్లో వేయడం గతంలో ఆనవాయితీ. మరుసటి రోజు సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు చేసుకుని, ఇష్ట దైవాలకు పూజలు చేసుకుంటారు. జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుందని కూడా చాలా మంది నమ్మకం. సంక్రాంతి రోజునే పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా గాలి పటాలు ఎగరవేస్తూ ఉల్లాసంగా ఆ రోజును గడుపుతారు.

అందుకే సంక్రాంతి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే విషయం గాలి పటాలు ఎగరవేయడం. ఆ కారణంగానే చాలా మంది సంక్రాంతిని కైట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఆ కైట్ ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్‌తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో వీటికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర పర్యాటకానికి ఊపందించేలా ఈ పండగను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే దీనిని ఒక మిఠాయిల పండగగ తీర్చి దిద్దారు.

ఈ కైట్ ఫెస్టివల్‌లో దాదాపు 1200 రకాల మిఠాయిలను స్టాల్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో అరిసెలు, బొబ్బట్లు, బాదుషాలు, లడ్డులు, రసగుల్లాలు ఇలా అనేక రకాలు ఉండనున్నాయి. కొన్ని విదేశాల్లో ఫేమస్ అయిన స్వీట్లు కూడా ఉండనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, టూరిజాన్ని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా అంత‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్‌, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను నిర్వహించనున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమాలు జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ‘‘సెలబ్రేట్ ది స్కె పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘అదే విధంగా కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ సహకారంతో జరిగే మిఠాయిల‌ ఉత్సవంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 ర‌కాల‌ రకాల మిఠాయిలను, తెలంగాణ పిండి వంట‌ల‌ను 60 స్టాళ్ల‌లో అందుబాటులో ఉంచుతాం. 100 చేనేత, హస్తకళల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తాం’’ అని తెలిపారు.

‘‘జనవరి 16 నుండి 18 వరకు హట్ ఏయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వ‌హిస్తున్నాం. ఐరోపా దేశాల‌కు చెందిన‌ ప్ర‌తినిధుల‌తో అంత‌ర్జాతీయ స్థాయి బెలూన్లతో ప్రదర్శన ఉంటుంది. ఉదయం పూట హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం వేళ పరేడ్ గ్రౌండ్స్‌లో "నైట్ గ్లో బెలూన్ షో ఉంటుంది. ఈ బెలూన్ లో విహ‌రించే ఔత్స‌హికులు బుక్ మై షో లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో బుకింగ్ చేసుకోవాలి. జనవరి 16 నుంచి 17 వ‌ర‌కు గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక డ్రోన్లతో మెగా షో సాగ‌తుంది. ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం నుండి ఆధునిక ఆవిష్కరణల వరకు సాగిన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.

Read More
Next Story