
‘మహిళా టీచర్ల దినోత్సవం’.. ప్రకటించిన ప్రభుత్వం
సావిత్రిబాయి పూలేకు అరుదైన గౌరవం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. ఆమె జయంతిని ‘మహిళా టీచర్ల దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఆమె 195వ జయంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ గెజిట్‌ను విడుదల చేసింది. మహిళల విద్యకోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలకు గుర్తింపు సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతి ఏడాది జనవరి 3న ‘మహిళా టీచర్ల దినోత్సవం’గా అన్ని ప్రభుత్వకార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్త్రీ విద్యపై తీవ్ర ఆంక్షలు ఉన్న సమయంలో సామాజిక విశ్వాసాలను దిక్కరించి.. ఎందరో మహిళలకు విద్యను అందించడంలో ఆమె ముందున్నారు. జ్యోతిరావు పూలె తన భార్యకు చదువు నేర్పించారు. ఆ చదువు తనతో ఆగిపోకుండి ప్రతి ఆడబిడ్డకు చేరువ కావాలని సాయిత్రిబాయి పూలే భావించారు. ఆ లక్ష్యంతోనే ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. భారతేశంలో తొలి బాలికల పాఠశాలను కూడా ఆమె ప్రారంభించారు. తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి విద్య కోసం విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా రంగంలో పని చేస్తున్న మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇంతకాలం ఉపాధ్యాయదినోత్సవం ఒకటే ఉండేది. సర్వేల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాగా మహిళా టీచర్లకు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై ప్రతి ఏడాది రెండుసార్లు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించబడనుంది. అయితే వీటితో పాటు అక్టోబర్ 5న అంతర్జాతీయ టీచర్స్ డేను కూడా నిర్వహిస్తున్నారు.

