సీఎం సెక్యూరిటీలో మార్పులు.. పోలీసుల నిరసనలే కారణం..!
x

సీఎం సెక్యూరిటీలో మార్పులు.. పోలీసుల నిరసనలే కారణం..!

తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ పోలీసులు కొన్ని రోజులు రొడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో సీఎం భద్రతలో మార్పులు వచ్చాయి.


తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ పోలీసులు కొన్ని రోజులు రొడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా వారు మాత్రం వెనకడుగు వేయడం లేదు. వారి సెలవులను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు డీజీపీ వెల్లడించినా బెటాలియన్ పోలీసులు మాత్రం వెనకడుతు వేయలేదు. ఈ నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ సెక్యూరిటీలో మార్పులు చేయాలని, మరింత పటిష్టమైన భద్రతను ముఖ్యమంత్రికి అందించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ శాఖలు కూడా రంగంలోకి దిగాయి. వారి హెచ్చరికల నేపథ్యంలోనే సీఎం రేవంత్ నివాసం దగ్గర సెక్యూరిటీ ఏర్పాట్లలో భారీ మార్పులు చేశారు. సీఎం ఇంటి దగ్గర ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు తమ కుటుంబీకులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం ఊడుతున్నా తగ్గని పోలీసులు

రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా నిరసనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీజీపీ జితేందర్ చెప్పిన విధంగా కఠిన చర్యలు చేపడుతున్నారు. క్రమశిక్షణ చర్యల పేరుతో 39 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఆదివారం రోజున మరో హెడ్ కానిస్టేబుల్ సహా 10 మందిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలా చర్యలు తీసుకుంటున్నా పోలీసులు మాత్రం నిరసన విరమించుకోవడం లేదు. తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూనే ఉనస్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదే..

తెలంగాణలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. బెటాలియన్ పోలీసుల సెలవుల రద్దు విషయంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను మానవీయకోణంతో పరిష్కరించాలని యోచిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల సెలవులను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన తమ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని కూడా సర్కార్ యోచిస్తోంది.

కానిస్టేబుళ్ల భార్యల డిమాండ్ ఇదే..

తెలంగాణలో పలు జిల్లాల్లోని పోలీస్ బెటాలియన్ అధికారుల భార్యలు ఒకే డిమాండ్‌తో రొడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా వారంతా కలిసి సచివాలయం ముట్టడికి కూడా ప్రయత్నించారు. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు, కుమారులకు ఒకే ప్రదేశంలో డ్యూటీ వేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నోటిఫికేషన్, పరీక్షలు ఒక్కటే అయినప్పుడు ఉద్యోగ నిబంధనలు కూడా అందరికీ ఒకేలా ఉండాలని, అలా కాకుండా తమ భర్తలు, కుమారులనే కుటుంబాలకు దూరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వడం ఏంటని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులకు వత్తాసుగా ఇప్పుడు పలు జిల్లాల్లో బెటాలియన్ పోలీసులు కూడా నిరసనకు బైఠాయించారు.

Read More
Next Story