
సివిల్స్ లో తెలంగాణ టాప్ లో ఉండాలి....
అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఏదో విధంగా సాయం చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. తెలంగాణ నుంచి సివిల్స్ కు ఎంపికయ్యే వారి సంఖ్య పెంచేందుకు రకరకాల రూపంలో చేయూత నీయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు.
సోమవారం ఆయన ప్రజాభవన్లో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ ఔత్సాహికులను ఉద్దేశించి మాట్లాడారు.
"నవ వనరులు అతి ముఖ్యమైనవి అవి బలమైన పెట్టుబడులు. ఆ మానవ వనరులను సానబట్టి వజ్రాలుగా తయారు చేస్తే సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి సివిల్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో కొంత సాయం చేయాలని నిర్ణయించింది. వారు లక్ష్యం సాధించేందుకుతోడ్పడేందుకు నేటి ఆర్థిక సహకార కార్యక్రమం చేపట్టాము,"అని భట్టి తెలిపారు.
మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నామని చెబుతూ ఇంటర్వ్యూ కి ఎంపికైన వారికి కూడా లక్ష ఆర్థిక సాయం చేయడంతో పాటు ఢిల్లీలో వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సహాయం అందించగా పదిమంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారని వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశముంటుందని ఆయన చెప్పారు.
వేలాదిమంది ఐఎఎస్ అధికారులు రాష్ట్రంలో పనిచేసినా ఎస్సార్ శంకరన్, పార్థసారధి, మాధవరావు వంటి కొద్ది మంది పేర్లు మాత్రమే జనం గుండెల్లో ఎందుకు నిలిచిపోయాయో ఆయన వివరించారు.
"నిబద్ధతతో సేవలందిస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేస్తేనే ప్రభుత్వాలు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా ఫలితం ఉండదు," అని డిప్యూటీ సిఎం అన్నారు.
పేదల కోసం అను నిత్యం కృషి చేసిన ఎస్ ఆర్ శంకరన్ గురించి మాట్లాదుతూ , " సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రజల జీవన స్థితిగతుల్లోచాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవే నేటి సంక్షేమ కార్యక్ర మాలకు బాటవేశాయి," అని ప్రశంసించారు.