వీధికుక్కల విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు
x

వీధికుక్కల విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

స్టెరిలైజ్ వీధి జాగిలాలను పట్టుకోవద్దన్న తీర్పు పొడిగింపు.


వీధి కుక్కలను పట్టుకుంటున్న విషయంలో జీహెచ్ఎంసీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్టెరిలైజ్‌డ్ వీధి కుక్కలను పట్టుకోవద్దన్న తన పూర్వ ఆదేశాలను డిసెంబర్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫిర్యాదు వచ్చిన సమయంలో వాటిని పట్టుకోవచ్చని జస్టిస్ బీ విజయసేన్ రెడ్డి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ నవంబర్ నెలలో నడుం బిగించింది. వీధి కుక్కలను భారీ ఎత్తున్న పట్టుకోవడం స్టార్ట్ చేసింది. దీనిపై యానిమల్ షెల్టర్ అండ్ రెస్క్యూ ఎయిడ్(AASRA) ఓ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వీధి కుక్కల నియంత్రణ చర్యలన్నింటినీ సస్పెండ్ చేయాలని తన పిటిషన్‌లో కోరింది. ఆ పిటిషన్ విచారణలో భాగంగానే వీధి కుక్కలను పట్టుకోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ ఆర్డర్లు సోమవారం.. డిసెంబర్ 2 వరకు పొడిగించింది.

సుప్రీంకోర్టు ఆదేశంలోని 25(A)–(E) మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేసే వరకు ఈ కార్యకలాపాలను నిలిపేయాలని కోర్టును AASRA అభ్యర్థించింది. అదేవిధంగా, తగిన రిహాబిలిటేషన్‌ సౌకర్యాలు సిద్ధం అయ్యే వరకు పట్టుకున్న కుక్కలను తిరిగి వదిలేయాలని కోరింది. కుక్కలను పట్టుకోవడనికి అధికారులు క్రూర పద్దతులను అనుసరిస్తున్నారని ఆస్రా పేర్కొంది. ఆస్రా తరుపున న్యాయవాది ఎక్స్‌జీ కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. ‘‘GHMC అధికారులు కుక్కలను పట్టుకోవడంలో క్రూరమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. స్టెరిలైజ్‌ చేసిన కుక్కలను కూడా తెలియని కేంద్రాలకు తరలిస్తున్నారు. హైద‌రాబాద్‌లో సరిపడినంత జంతు సంరక్షణ కేంద్రాలు లేవు’’ అని తెలిపారు.

ఈ కేసులో జీహెచ్ఎంసీ తరుపున న్యాయవాది జీ మధుసదన్ రెడ్డి వాదనలు వినిపించారు. అధికారులు సుప్రీంకోర్టు ఆేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కుక్కల దాడులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు గాయపడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, స్టేడియాలు వంటి ప్రాంతాలను మొదట కంచెతో చుట్టి, వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించాలని తెలిపిందని హైకోర్టు చెప్పింది. కాగా ఈ విషయంలో జీహెచ్ఎంసీ.. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా తారుమారు చేసిందని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు.

అనంతరం న్యాయస్థానం ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వీధి కుక్కలను పట్టుకోవడాన్ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది. మంగళవారం విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలకు జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్న చర్యలు అనుగుణంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని న్యాయస్థానం పరిశీలించనుంది.

Read More
Next Story