వీధికుక్కల దాడి ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
x

వీధికుక్కల దాడి ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

వీధి కుక్కల దాడి ఘటనపై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.


వీధి కుక్కల దాడి ఘటనపై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతకొంతకాలంగా రాష్ట్రంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలదాడి ఘటనల్లో కొంతమంది చిన్నారులు మృత్యువాత పడగా, అనేకమంది తీవ్రగాయాలపాలైన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం వీధికుక్కల దాడిలో హైదరాబాద్ జవహర్ నగర్ కి చెందిన సంవత్సరంన్నర బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. దీనిపై నేడు హైకోర్టు విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తూ... జీహెచ్ఎంసి వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. హైదరాబాద్ లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారని, ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెర్లైజేషన్ చేస్తున్నారని కోర్టుకి వెల్లడించారు.

అయితే, స్టెరిలైజేషన్ ద్వారా దాడి ఘటనలను ఎలా ఆపుతారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది. షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది తెలిపారు. నాగ్ పూర్ లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read More
Next Story