స్థానిక ఎన్నికలు ఎప్పుడు..: హైకోర్టు
x

స్థానిక ఎన్నికలు ఎప్పుడు..: హైకోర్టు

రెండు వారాల సమయం కోరిన ప్రభుత్వం.


తెలంగాణ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల తలనొప్పి మళ్ళీ వచ్చి పడింది. స్థానిక ఎన్నికలను బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహిస్తామని ప్రభుత్వం అంటోంది. ఆ బీసీ రిజర్వేషన్ల ఎటూ తేలకుండా ఉంది. ఆ బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ హైకోర్టు.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. కాగా తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోరాయి. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశాన్ని హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్న అంశంపై అడ్వకేట్ సురేందర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 9న ఇచ్చిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఛాలెంజ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా? అని ప్రశ్నించింది. అయితే అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా లేదని ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. చట్టంగా చేయడం కుదరని పక్షంలో పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయించింది. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు బీసీ రిజర్వేషన్లతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. బీసీ రిజర్వేషన్లను అమలు చేసేలా జీఓ నెం.9 తీసుకొస్తే.. దానిపై హైకోర్టు స్టే విధించింది. దాంతో వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దయింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు.. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది.

Read More
Next Story