
Tummala Nageswara Rao | ‘ఆయిల్ పామ్ సాగులోకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లూ వస్తున్నారు’
తెలంగాణ రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
తెలంగాణ రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. అందుకోసమే పామాయిల్ సాగుపై దృష్టి పెడుతున్నామని, రైతును రాజు చేయాలంటే ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని నిశ్చియించుకున్నామని తెలిపారు. అందుకోసమే ఆయిల్ పామ్ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మలేషియా కూడా వెళ్లామని, అక్కడి ఆయిల్ పామ్ సాగులో మెళకువలను తెలుసుకున్నామని చెప్పారు. రైతులు నష్టాల పాలవకుండా వారికి లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని మంత్రి వివరించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదయ్యే సమయానికి పామాయిల్ గెల ధర బీభత్సంగా పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ ధర రూ.20,413 ఉందని తెలిపారు. ఇందులో వచ్చే లాభాలు చూసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారని, ఉద్యోగాలు మానేసి మరీ ఆయిల్ పామ్ సాగులోకి అడుగుపెడుతున్నారని చెప్పారు. తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.
అదే నా చిరకాల కోరిక
‘‘సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం నా చిరకాల కోరిక. 15 ఆగస్టు 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిస్తాం. రూ.66 కోట్లతో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంక్రాంతి నాటికి శంకుస్థాపన చేస్తాం. జాతీయ రహదారుల ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పడుతుంది. నా రాజకీయ జీవితంలో ఇరిగేషన్, నేషనల్ హైవేల కోసం మంత్రివర్గంలో పనిచేసే అవకాశం లభించింది. రైతు బిడ్డనైన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసే సువర్ణ అవకాశాన్ని నాకు రేవంత్ కల్పించారు’’ అని తెలిపారు.
ఉద్యాన పంటల సాగుతో రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. ఎకరా సాగు భూమికి నాలుగు సంవత్సరాల్లో రూ.50 వేల ప్రోత్సాహం అందిస్తామని ఆయన చెప్పారు. ‘‘భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూడా చేపడతాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. ఈ నెల 7న వైద్య కళాశాలను శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పించడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై ఆరోగ్య మంత్రికి పలు ప్రతిపాదనలు చేశాను. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.