వ్యాక్సిన్ల తయారీ కేంద్రం తెలంగాణ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో కేంద్రంగా మారిందని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
వ్యాక్సిన్ల తయారీలోనే కాకుండా ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎదిగిందని పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కరోనా సమయంలో నాలుగు వ్యాక్సిన్లు దేశంలో తయారు కాగా, మూడు వ్యాక్సిన్లు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అయ్యాయని శ్రీధర్ బాబు గుర్తు చేశారు.అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో మూడో వంతు హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ నంబర్ వన్
ఔషధ ఉత్పత్తుల్లో 30 శాతం తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. విదేశాలకు ఎగుమతి అయ్యే మందులలో 40 శాతం వాటా రాష్ట్రానిదేనని ఆయన పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణా నుంచే వెళ్లడం గర్వకారణమని మంత్రి తెలిపారు.ఔషధ ఉత్పత్తులు,ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందన్నారు. ఫార్మా మ్యాన్యుఫక్చరింగ్ హబ్ గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇండియా ల్యాబ్ ఎక్స్ పో-2024 ప్రారంభం
గురువారం హైటెక్స్ లో మంత్రి శ్రీధర్ బాబు‘ఇండియా ల్యాబ్ ఎక్స్ పో-2024’ ను ప్రారంభించిన అనంతరం ఔషధ పరిశ్రమ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.లైఫ్ సైన్సెస్,మెడ్ టెక్ అంకుర సంస్థల్లో తెలంగాణ వాటా 19 శాతంగా నమోదైందని మంత్రి చెప్పారు. గడచిన నాలుగేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం కారణంగా ఫార్మా, లైఫ్ సైన్స్ స్ సంస్థలు తెలంగాణాను ముఖ్యమైన గమ్యస్థానంగా భావిస్తున్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
జినోమ్ వ్యాలీ నాలుగో దశ విస్తరణ
ఎంఎస్ ఎస్ ఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణా రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని, మానవ వనరులకు కొదవే లేదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జినోమ్ వ్యాలీ నాలుగో దశ విస్తరణకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు లైఫ్ సైన్సెస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ల్యాబ్ ఎక్స్ పోలో 25 దేశాల నుంచి 25 వేల ఉత్పత్తులు ప్రదర్శనకు రావడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫార్మా రంగ ప్రముఖులు భూపిందర్ సింగ్, హర్షిత్ షా, డా. ఎస్వీ వీరమణి తదిరులు పాల్గొన్నారు.
Next Story