
‘సీఎం కూతురిని అయినా ఒక్క పని జరగలేదు’
తండ్రిగా కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్లాను తప్పా.. రాజకీయంగా మళ్ళీ అటు వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన కవిత.
బీఆర్ఎస్ హయాంలో సీఎం కూతురిని అయినా తనకు ఒక్క పని జరగలేదని, టీచర్‌ను బదిలీ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉండేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. అలాంటిది తాను అవినీతికి ఎలా పాల్పడతానని ప్రశ్నించారు. కొందరు తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వేటికీ తాను భయపడనని చెప్పారు. బీఆర్ఎస్‌లోకి కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్లాను తప్పా.. రాజకీయంగా మళ్ళీ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్‌లో తనను ప్రోటోకాల్ పేరుతో తనను నిజామాబాద్‌కే కట్టడి చేశారని అన్నారు. ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటదో ఇక్కడి నుంచి చూపిస్తానని అన్నారు. వరంగల్ వరదల్లో మునిగిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పరిహారం అందించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ లో పర్యటించి పక్షం రోజులైనా పరిహారం ఇంకా అందలేదని ఆమె ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో దేవీ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
బిఆర్ఎస్ హాయంలో తనపై ఆంక్షలు
తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనపై ఆంక్షలు విధించారని కవిత ఆరోపించారు. ప్రోటోకాల్ నిబంధనలతో తనను కట్టడి చేశారని ఆమె చెప్పారు. అందుకే జనంలో తిరగలేక పోయానని వివరించారు. తనపై వివక్ష వల్లే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కూతురునైనప్పటికీ పనులు జరగలేదన్నారు. అందుకే తనకు మంత్రి పదవి అవకాశం కూడా రాలేదని కవిత వివరించారు. ఒక ఎయిడెడ్ కాలేజీ అనుమతి కోసం సంవత్సరం తిరిగానని కవిత గుర్తు చేశారు. ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి నిరంతరం పోరాడుతుందని చెప్పారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. గతంలో విటీడీఏ ద్వారా టెండర్లు ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందించకపోవడం శోచనీయమని చెప్పారు.
వరంగల్ లో ఆడపిల్లలకు హాస్టల్ లేకపోవడం దారుణం
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆడపిల్లలకు హాస్టల్ లేకపోవడం దారుణమని కవిత విమర్శించారు. సమ్మక్క - సారక్క తరహా జిల్లాలో మంత్రులు సీతక్క, సురేఖ ఉన్నారని కవిత ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు మహిళా మంత్రులు జిల్లా అభివృద్ధి కోసం చేసింది శూన్యమని ఆమె విమర్శించారు. కాకతీయ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించాలని కవిత కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి ఎంజీఎంను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎంజీఎం నిర్లక్ష్యానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనంబాట వరంగల్ లో
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ , తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పిచారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి తన జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జనం బాట పూర్తి చేసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరంగల్ లో పర్యటిస్తున్నారు.
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా 33 జిల్లాలలో తన యాత్రకు కవిత రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
జాగృతి జనం బాటకు సంబంధించిన పోస్టర్‌ను గత నెల 15న హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. పోస్టర్‌పై తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు ఉండటం అప్పట్లో సంచలనమైంది. బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, కనుక కేసీఆర్ ఫోటోను యాత్రలో వాడుకోవడం తన నైతిక విలువలకు విరుద్ధమని కవిత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

