అనారోగ్యంతో జిట్టా మృతి
x
BRS leader Jitta

అనారోగ్యంతో జిట్టా మృతి

తెలంగాణా ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు.


తెలంగాణా ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. జిట్టా దాదాపు రెండునెలలుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆయన పరిస్ధితి విషమించటంతో డాక్టర్లు కుటుంబసభ్యులందరినీ పిలిపించారు. తర్వాత కొద్దిసేపటికు జిట్టా మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా తెలంగాణా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి టీఆర్ఎస్ లోని యువజన విభాగాలన్నింటికీ అధ్యక్షుడిగా చాలా చురుగ్గా పాల్గొనేవారు.

2009 ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఉద్యమకారుడికి అప్పట్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దాంతో జిట్టా పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీలో కూడా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత ‘యువ తెలంగాణా’ అనే పార్టీని స్ధాపించి కొంతకాలం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత సొంతపార్టీ లాభంలేదని అర్ధమై దాన్ని బీజేపీలో విలీనం చేసేశారు. అయితే పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదన్న ఆవేధనతో 2023 ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. టికెట్ హామీతో బీఆర్ఎస్ లో చేరినా చివరకు పోటీకి అవకాశమైతే దొరకలేదు. భువనగిరి ఎంపీగా పోటీచేయించబోతున్నట్లు బాగా ప్రచారం జరిగినా కేసీఆర్ చివరకు టికెట్ అయితే ఇవ్వలేదు.

ప్రజా ప్రతినిధిగా పనిచేయాలన్న ఆశ తీరకుండానే జిట్టా కాలంచేశారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం భువనగిరిలో అంత్యక్రియలు పూర్తిచేయటానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More
Next Story