బీఆర్ఎస్ మళ్లీ టిఆర్ ఎస్ అవుతుందా?: జాతకాలు లెక్కిస్తున్నారు?
బీఆర్ఎస్ టీఆర్ఎస్‌గా మారుతోందా బీఆర్ఎస్ కార్యకర్తలు, కీలకనేతలు నుంచి పెరుగుతున్న వత్తిడి. పార్టీ పేరు మార్పు గురించి న్యాయనిపుణులతో సంప్రదింపులు
దేశంలో ఏ రాజకీయ పార్టీ తన పేరును మార్చుకోలేదు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని గులాబీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడినట్లయింది. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై విశ్లేషించగా 80 శాతం మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పేరు మార్పే పార్టీ ఓటమికి కారణమని చెప్పడం విశేషం. పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించడం వల్ల ఆ పార్టీ అస్థిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో అంతర్ మదనం ప్రారంభమైంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి వీలుగా గులాబీ బాస్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బిజెపి వ్యతిరేక పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆశయం నెర వేరలేదు. దీనితో టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చాలనుకున్నారు. 2022 అక్టోబర 5 టిఆర్ ఎస్ పార్టీ రాష్ట్రకమిటీ సమావేశమయి టిఆర్ ఎస్ ను బిఆర్ ఎస్ గా మార్చాలని తీర్మానం చేసింది. ఇది కూడా చాలా నాటకీయంగా జరిగింది. పేరు మార్పునకు ఆరోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకలు సుముహూర్తం నిర్ణయించారు. సరిగ్గా ముహూర్తానికి పేరు మార్పిడి పూజ, తీర్మానం ఆమోదించడం జరిగింది.ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జెడిఎస్ నేత కుమారస్వామి గౌడ హాజరయ్యారు. ఆ తర్వాత పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రంలో బిఆర్ ఎస్ తరఫున అనే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒదిషా నుంచి మాజీ కేంద్రం గిరిధర్ గామాంగ్ ని, ఆయనకుమారుని పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఉత్సాహం తో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, 2022 అక్టోబర్ 5 న, పెట్టిన ముహూర్తం పనిచేయలేదు. కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ఎన్నికల్లో బిఆర్ ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవినీతి కేసులు తవ్వి తీసుకున్నారు.ఢల్లీ లిక్కర్ పాలసీ కేసు లోచి ఇడి విచారణ ముమ్మరం చేసి మనీ లాండరింగ్ కేసులో కెసిఆర్ కుమార్తె కవితను అరెస్టు కూడా చేశారు. పేరు మార్చిన తర్వాత అన్నీ నష్టాలే తప్ప లాభాల్లేవని, పార్టీ కష్టాల్లో పడేందుకు కారణం పేరు మార్పిడే యే కారణమనే భావం పార్టీ క్యాడర్ లో నే లీడర్ లలో కూడా మొదలయింది.
పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యాం : కడియం శ్రీహరి
పార్టీ పేరులో తెలంగాణను తొలగించడం వల్ల ప్రజలకు దూరమయ్యమనే భావనను తొలిసారి వ్యక్తీకరనించిన సీనియర్ లీడర్ మాజీ మంత్రి, ప్రస్థుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం ఎదురుకాగానే ఆయన ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారావు (కెటిఆర్ ) ఎదురుగానే సూచించారు. జనవరి 11న, వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో శ్రీహరి ప్రసంగించారు. అపుడు కెటిఆర్ కూడా సమావేశంలో ఉన్నారు. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గిరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలి,’’ ఆయన సూచించారు.
. మెజారిటీ కార్యకర్తలు పేరు మార్చాలని కోరుకుంటున్నారని దీని చర్యలు తీసుకోవాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు కడియం సూచించారు. తెలంగాణ తీసేసి భారత్ ను చేర్చడం వల్ల ఈ పార్టీ తమది కాదన్న భావన ఓటర్లలోకి వెళ్లిందని కడియం పేర్కొన్నారు. మొత్తంమీద కడియం శ్రీహరి, బోయిన్ పల్లి వినోద్ కుమార్ లు చేసిన తాజా వ్యాఖ్యలతో పేరు మార్పుపై గులాబీ బాస్ తోపాటు నేతలు కసరత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు.
న్యాయనిపుణులతో బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు
జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ వ్యూహాన్ని రూపొందిస్తే బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ తొలగింపుతో తెలంగాణ పార్టీ ఉనికి కోల్పోయింది. ఇక కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే, ఇపుడాయన ముందున్న ప్రధాన కార్యక్రమం బిఆర్ ఎస్ ను కాపాడుకోవడం. బిఆర్ఎస్ ను ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ బిజెపిలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ విషయం గుర్తించినందునే కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం మానేశారని ఒక టాక్ వినబడుతూ ఉంది. "దానితోడు, ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పార్టీకి దూరమయ్యారని వినికిడి. అలాగే మహారాష్ట్ర బిఆర్ ఎస్ నేత ఏకంగా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్ సిపిలో చేరారు. ఓదిశా కు చెందిన గిరిధర్ గమాంగ్ ఎపుడో పార్టీని వదిలేశారు. అందువల్ల ఇక ఏముందని బిఆర్ ఎస్ పార్టీ కొనసాగించాలి, అని బిఆర్ ఎస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో టిఆర్ ఎస్ పేరు పునరుద్ధించడం మీద పార్టీల చర్చ జరుగుతూ ఉందని తెలిసింది. టిఆర్ ఎస్ పార్టీ పేరు ఇంకా మిగిలే ఉందా, మరేవరైనా ఆ పేరుతో పార్టీని నమోదచేయించారా, ఒక వైళ పార్టీ నిటిఆర్ ఎస్ గా మారిస్తే వచ్చే ప్యవసానాలేమిటీ అనేదాని మీద న్యాయనిపుణులో కూడా చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది.
2023 అసెబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఓటమికి కారణాలపై విశ్లేషించగా 80 శాతం మంది కార్యకర్తలు పేరు మార్పే కొంప ముంచిందని చెబుతున్నారని గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు, మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మెజార్టీ కార్యకర్తల అభీష్టం మేర తాము పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పార్టీ పేరు మార్పుతో ప్రజల్లో గందరగోళం ఏర్పడవచ్చు : తెలంగాణ సామాజిక విశ్లేషకులు పాపారావు
పార్టీ పేరును మళ్లీ మార్చడం వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని తెలంగాణ రాష్ట్ర సామాజిక విశ్లేషకులు పాపారావు చెప్పారు. పేరు మార్పు వల్లనే ఓటమి పాలయ్యామని పార్టీ కేడరు చెపుతున్నా, సామాన్య ప్రజలకు పేరులో ఏముందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఇంకా ఉందని, అయితే ప్రజలు నీళ్లు,నిధులు, నియమకాలపైనే దృష్టి సారించారని పాపారావు చెప్పారు. బీఆర్ఎస్ గా మారాక టీఆర్ఎస్ పేరును మరో నాయకుడు దాన్ని రిజిస్టరు చేయించుకున్నారని, దాన్ని బీఆర్ఎస్ వాళ్లు ఎలా తీసుకుంటారని పాపారావు ప్రశ్నించారు.
అవినీతి, అహంకారం వల్లనే ఓడి పోయారు : తెలంగాణ ఉద్యమకారుడు కర్రా యాదవరెడ్డి
కాగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పార్టీ పేరు మార్పు కారణం కాదని వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రైల్వే మజ్ధూర్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కర్రా యాదవ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, వారి అహంకారం వల్ల పతనం అయ్యారని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు రాబందుల్లా వేల ఎకరాల భూకబ్జాలతో వేలకోట్లకు పడగలెత్తారని, చెరువు శిఖం భూములను సైతం కబ్జా చేశారని, దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని కర్ర యాదవరెడ్డి విశ్లేషించారు. పేరు మార్పు వల్ల ఓడిపోయామనేది సాకు మాత్రమేనని ఆయన చెప్పారు.
Next Story