Independence Day | 20 ఏళ్ళ తర్వాత జెండా పండగ జరుపుకున్న మంచరామి స్కూల్
x
Flag hoisting after 20 years in Mancharami Mandal School

Independence Day | 20 ఏళ్ళ తర్వాత జెండా పండగ జరుపుకున్న మంచరామి స్కూల్

తెలంగాణ మంచరామి మండల పరిషత్ స్కూల్ కు పునర్జన్మ


స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వ, ప్రైవేటు అని తేడాలేకుండా అన్నీ విద్యాసంస్ధలు, కార్యాలయాలు, ఆఫీసుల్లో జాతీయజెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో శుక్రవారం ఉదయం పైనచెప్పుకున్నట్లు అన్నీస్కూళ్ళల్లో మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. జెండా ఎగరేసిన స్కూళ్ళ జాబితాలో ఈ ఏడాది పెద్దపల్లి(Pedappalli) జిల్లా, సుల్తానాబాద్(Sultanabad) లోని మంచరామి మండల పరిషత్ పాఠశాల(Mancharami Mandal Parishad School) కూడా చేరింది. అన్నీ స్కూళ్ళల్లాగే ఈస్కూలులో కూడా జెండా ఎగరేయటంలో గొప్పేముంది అనే అనుమానం రావచ్చు. ఉంది ఈ ఊరి స్కూలుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మంచరామి స్కూలు సుమారు 20 ఏళ్ళ తర్వాత ప్రాణంపోసుకుంది. దాదాపు 20 ఏళ్ళక్రితం మూతపడిన మంచరామి స్కూలు పునఃప్రారంభమైన తర్వాత ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్యదినోత్సవం పండుగ(Independence Day) వచ్చింది. అందుకనే అన్నీ స్కూళ్ళలాగే ఇక్కడ కూడా జెండా రెపరెపలాడినా ఊరుమొత్తానికి కొత్త కళను తెచ్చింది. అందుకనే ఈ స్కూలు చాలా ప్రత్యేకం.


ఇపుడు అసలు విషయంలోకి వెళితే చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లాగే మంచరామిలోని మండల పరిషత్ స్కూలులో పిల్లలు లేరని చెప్పి దాదాపు 20 ఏళ్ళ క్రితం విద్యాశాఖ అధికారులు మూసేశారు. అప్పటినుండి ఊరిలో పాఠశాల అన్నదే లేదు. మూతేశారు కాబట్టి ఆస్కూలు, ప్రాంగణం అనేక కార్యక్రమాలకు నిలయమైపోయింది. స్కూలు మూతేసినంత మాత్రాన మరి పిల్లలు చదువులు ఆగిపోవుకదా. చాలా ప్రభుత్వ స్కూళ్ళను దెబ్బకొట్టినట్లే ప్రైవేటు, కార్పరేట్ స్కూళ్ళ దెబ్బకు మంచరామి గ్రామపంచాయితీలోని చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లి, దండ్రులు ప్రైవేటు స్కూళ్ళవైపు మొగ్గారు. దాంతో ఈఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోని తొవ్వరాయ్, కనుకుల గ్రామాల్లోని ప్రైవేటు స్కూళ్ళకు పిల్లలను పంపుతున్నారు.


నిజానికి ఈ గ్రామంలో స్కూలుకు వెళ్ళే పిల్లలు సుమారు 100 మంది ఉన్నారు. అయితే చాలాచోట్ల ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళని మింగేసినట్లే ఇక్కడ కూడా మింగేశాయి. కొందరు పిల్లలేమో పైన చెప్పిన రెండు స్కూళ్ళల్లో చదువుతుంటే మరికొందరు పిల్లలేమో మండలకేంద్రమైన సుల్తానాబాద్ లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. సుల్తానాబాద్ నుండి మూడు బస్సులువచ్చి పిల్లలను తమస్కూళ్ళకు తీసుకువెళతాయి ప్రతిరోజు. చుట్టూ నీరున్నా తాగటానికి గుక్కెడు నీళ్ళు కూడా దొరకటంలేదన్నట్లుగా తయారైంది మంచరామి గ్రామం పరిస్ధితి. ఊరిలోనే మండల పరిషత్ స్కూలున్నా చదువుకునే పిల్లలు లేక ప్రైవేటు స్కూళ్ళకు తల్లి, దండ్రులు పంపుతున్నారు. ఇదంతా చాలాకాలంగా ఊరిలోనే ఉంటున్న కొట్లె గట్టయ్య చూస్తున్నాడు. ఇదే విషయం ఊరిలోని పెద్దలు కలిసినపుడు మాట్లాడుకుంటున్నది గమనించాడు. ఇంతకీ గట్టయ్య ఎవరంటే ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. ఊరిబాగుకోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలన్న పద్దతిలో తానే ఎందుకు పూనుకోకూడదని ఆలోచించాడు. ఊరిలోని కొందరితో ఇదేవిషయాన్ని చర్చించాడు. తర్వాత గ్రామంలోని ప్రతిగడపకు వెళ్ళాడు. తల్లి, దండ్రులతో మాట్లాడాడు.


ఉచితంగా చదువుచెబుతున్న ప్రభుత్వ స్కూలుకన్నా వేలాది రూపాయలు ఫీజులుకట్టి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించటమే గొప్పగా తల్లి, దండ్రులు భావిస్తున్న రోజులివి. ఈ గ్రామంలో కూడా గట్టయ్య ఆలోచన అంతతొందరగా పారలేదు. అందుకనే తన ఆలోచనతో ఏకీభవించిన వారిని కలుపుకుని అందరి ఇళ్ళకు వెళ్ళి ఒకటికి రెండుసార్లు తల్లి, దండ్రులతో మాట్లాడిన తర్వాత కొందరు పాజిటివ్ గా స్పందించారు. ఇంతకీ గట్టయ్య ఆలోచన ఏమిటంటే మూతపడిన మండల స్కూలును పునఃప్రారంభించటమే. గ్రామంలో సానుకూల స్పందన వచ్చిన వెంటనే కొందరు పెద్దలతో మాట్లాడి విద్యాశాఖ అధికారులకు లేఖలు రాయించాడు. పిల్లలను చేర్పించేట్లయితే స్కూలును పునఃప్రారంభించటంలో అభ్యంతరాలు లేవని విద్యాశాఖ నుండి సమాధానం వచ్చింది. ఆ సమాధానమే గట్టయ్యలో రెట్టించిన ఉత్సాహం నింపింది.



స్కూలు అవసరాలు ఏమిటి ?


వెంటనే గ్రామంలోని కొందరు పెద్దలను కలిసి పునఃప్రారంభానికి అవసరమైన వ్యవహారాలు మాట్లాడి ఒప్పించాడు. ఇంతకీ ఆ విషయాలు ఏమిటంటే స్కూలులో చేరే పిల్లలకు ఉచితంగా పుస్తకాలను అందించటం. స్కూలులో పిల్లలు తాగటానికి మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయటం, టీచర్లు చదువుచెప్పేందుకు బ్లాక్ బోర్డును ఏర్పాటుచేయించటం. టీచర్లు కూర్చోవాటనికి టేబుల్, బెంచీలు, పిల్లలు కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటుచేయటం. మధ్యాహ్న భోజనపథకం అమలయ్యేందుకు గ్యాస్ బండ, గ్యాస్ పొయ్యిని సమకూర్చటం, బియ్యం, పప్పు, ఉప్పులు అందించటం, స్కూలు రికార్డులు భద్రపరుచుకునేందుకు ఇనుపబీరువా ఏర్పాటు, స్కూలుకు లోపలా, బయట రంగులు వేయించటం, ఫ్లోరింగ్ సరిచేయించటం, బాత్ రూముల ఏర్పాటు ఇవ్వన్నీ చేయించాల్సిందే. పైన చెప్పినవన్నీ ప్రభుత్వమే చేయించాలంటే స్కూలు పునఃప్రారంభం జరిగేపనికాదని అందరికీ తెలుసు.

దాతల పెద్దమనసు


అందుకనే గట్టయ్య ఊరిలోని పెద్దలను, దాతలను కలిసి మాట్లాడి ఎవరి శక్తికొద్ది వాళ్ళను ఖర్చులు భరించేట్లుగా ఒప్పించాడు. ఫలితంగా స్కూలులో అవసరమైన రిపేర్లు చేయించేందుకు కేడీసీసీ బ్యాంకు రు. 13 వేలు విరాళంగా ఇచ్చింది. పిల్లలకు అవసరమైన పుస్తకాలను స్టేషనరీ షాపు ఓనర్ శ్రీనివాస్ అందించారు. బెంచీలకు మరమత్తలు చేయించటంతో పాటు టీచర్లు కూర్చోవటానికి 10 కుర్చీల కొనుగోలు ఖర్చులను ఈమధ్యనే రిటైర్ అయిన టీచర్ శారద భరించారు. యువజన నాయకుడు చల్లాసాయి మంచినీటిని అందించే ఫిల్టర్ కొనిచ్చాడు. వీర రాజిరెడ్డి, సాని గట్టయ్యలు తరగతి గదుల్లో ఫ్యాన్లు విరాళంగా ఇచ్చారు. ఏఎస్ఐ వీర తిరుపతి మధ్యాహ్న భోజనం వండేందుకు అవసరమైన గ్యాస్ పొయ్యిని ఇచ్చారు. వంటలకు అవసరమైన సిలిండర్లను పంచాయితి సెక్రటరీ నగనూరి లక్ష్మణ్ సమకూర్చారు. రేవెళ్ళ కిరణ్ రికార్డులు భద్రపరుచుకునేందుకు బీరువాను విరాళంగా ఇచ్చారు. పాడైపోయిన స్కూలు గచ్చు(ఫ్లోరింగ్)ను బాగుచేయించేందుకు మాజీ సర్పంచ్ ఉప్పు సంపత్ 15 బస్తాల సిమెంటు, కంకర, ఇసుకను పంపించారు. అలాగే పిల్లలందరికీ తలా ఒక వాటర్ బాటిల్ ను రిటైర్డ్ పోలీసు అధికారి ఉప్పు లక్ష్మీతిరుపతి అందించారు.

28 మంది పిల్లలు..ఇద్దరు టీచర్లు


గట్టయ్య ఆలోచనకు గ్రామస్తుల ప్రోత్సాహాన్ని గమనించిన మండల విద్యాశాఖ అధికారులు ఇద్దరు టీచర్లను నియమించారు. ఎప్పుడో మూతపడిన మండల పరిషత్ స్కూలు కొత్త కళతో ముస్తాబయ్యింది. ఫలితంగా మొన్నటి విద్యాసంవత్సరంలోనే ఈస్కూలు పునఃప్రారంభమైంది. ప్రస్తుతం స్కూలులో 28 మంది పిల్లలున్నారు. స్కూలు ప్రారంభం అవుతుందన్న నమ్మకం లేక చాలామంది తల్లి, దండ్రులు తమ పిల్లలను పొరుగూళ్ళల్లో ఉండే ప్రైవేటు స్కూళ్ళలో చేర్చారు. ఇపుడు తమ ఊరిలోనే స్కూలు ప్రారంభాన్ని గమనించిన తర్వాత వచ్చే విద్యాసంవత్సరానికి తమ పిల్లలను మండల స్కూలులోనే వేస్తామని గట్టయ్యకు హామీ ఇచ్చారు. లేకపోతే ఆ స్కూళ్ళల్లో కట్టిన ఫీజులు, కొన్న పుస్తకాలన్నీ వేస్ట్ అవుతాయని అన్నారు. గట్టయ్య కృషితో 20 ఏళ్ళ క్రితం మూతపడిన స్కూలు పునఃప్రారంభం అయిన తర్వాత వచ్చిన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టే ఈ స్వాతంత్ర్యం పండుగ మంచరామి స్కూలుకు ఎంతో ప్రత్యేకం.

వచ్చే ఏడాది ఇంకా ఎక్కువమంది చేరుతారు : గట్టయ్య


ఇదే విషయాన్ని కొట్లె గట్టయ్య తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడారు. గట్టయ్య మాట్లాడుతు ‘‘వచ్చే విద్యాసంవత్సరంలో మరింతమంది పిల్లలు చేరుతారు’’ అన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ‘‘మనఊరిలోనే స్కూలు పెట్టుకుని ఎక్కడో పొరుగూరికి వెళ్ళి ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలను చదివించటం తనకు నచ్చలేద’’న్నారు. ‘‘అందుకనే తన ఆలోచనను ఊరిపెద్దలతో పంచుకున్నపుడు అందరు తనను ప్రోత్సహించార’’ని చెప్పాడు. ‘‘తన ఆలోచన, ఊరివాళ్ళ ప్రోత్సాహం, దాతల మంచిమనసు కారణంగానే సంవత్సరాలక్రితం మూతపడిన మండలపరిషత్ స్కూలు తిరిగి తెరుచుకున్నద’’ని సంతోషంగా చెప్పాడు.

Read More
Next Story