పవన్ సినిమాలు ఆడనివ్వం: కోమటిరెడ్డి
x

పవన్ సినిమాలు ఆడనివ్వం: కోమటిరెడ్డి

ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి డిమాండ్.


తెలంగాణ ప్రజలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో తెలంగాణలో పవన్ సినిమా ఒక్క దాన్ని కూడా ఆడనివ్వమని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ మిడిమిడి జ్ఞానంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను అసలు రాజకీయాలు తెలియవని కూడా చురకలంటించారు. డిప్యూటీ సీఎం కాగానే ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ నాయకులు పవన్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు ఘాటుగా స్పందించారు. తాజాగా దీనిపై మంత్రి కోమటిరెడ్డి రెస్పాండ్ అయ్యారు.

‘‘పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఆయన సినిమాలు తెలంగాణలో ఒకటి, రెండు రోజులు ఆడుతాయి. లేదంటే ఒక్క సినిమా కూడా తెలంగాణలో ఆడదు. పవన్ కల్యాణ్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది. అతని మాటల వల్ల తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో మేము ఎంతో నష్టపోయాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బాగుపడతామని అనుకున్నాం. కానీ తొలి పాలకుడిగా అధికారం చేపట్టిన కేసీఆర్ వల్ల కూడా తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో కోలుకుంటున్నాం’’ అని కోమటిరెడ్డి అన్నారు.

అసలు విషయం ఏంటంటే..

ఇటీవల కోనసీమలో పర్యటించిన పవన్ కల్యాణ్.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయన్నారు. ఆ వ్యాఖ్యలు ఇంత దుమారం రేపాయి. ఎవరిపైనో పడి ఏడవాల్సిన అవస్థ తమకు ఏనాడూ లేదని, ఏనాటికీ రాదని తెలంగాణ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు కొందరు నాయకులు సవాళ్లు కూడా విసురుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read More
Next Story