బ్రిటన్ ఎన్నికల్లో ఓడిన తెలంగాణవాసి
బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తెలంగాణవాసి ఉదయ్ నాగరాజు ఓటమిపాలయ్యారు.
బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తెలంగాణవాసి ఉదయ్ నాగరాజు ఓటమిపాలయ్యారు. 5,414 ఓట్ల తేడాతో ఆయన కన్జర్వేటివ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. గత 14 ఏళ్లగా ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి లేబర్ పార్టీ అభ్యర్ధే గెలుస్తారని చెప్పిన సర్వే సంస్థల అంచనాలు తల్లకిందులయ్యాయి.
మళ్ళీ నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి రిచర్డ్ పుల్లర్ 19,981 ఓట్లతో విజయం సాధించారు. దీంతో లేబర్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉదయ్ 14,567 ఓట్లతో రెండో స్థానానికి పడిపోయారు. కాగా, ఉదయ్ నాగరాజు తెలంగాణలోని ఉమ్మడికరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు.
బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఉదయ్ లాభాపేక్ష లేని సంస్థలను నడపడం నుండి సమగ్ర అభివృద్ధిని పరిశోధించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ ల్యాబ్స్ ని నెలకొల్పడంలో కృషి చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు సంపాదించారు. ఈయన పీవీ నరసింహారావుకు దూరపు బంధువు కూడా.
యూకే లో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రుషి సునాక్ ప్రధాని అభ్యర్థిగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ళ తర్వాత ఘోర ఓటమి చవి చూసింది. లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం అందించిన లేబర్ పార్టీని అభినందనలు తెలుపుతున్నానని, ఓటమికి బాధ్యత వహిస్తున్నానని రుషి సునాక్ చెప్పారు. మద్దతుదారుల్ని క్షమించమని కోరారు.