చంద్రబాబుకు అచ్చిరావటంలేదా ?
తెలంగాణాలో పార్టీ చంద్రబాబునాయుడుకు అచ్చిరావటం లేదా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతున్నది.
తెలంగాణాలో పార్టీ చంద్రబాబునాయుడుకు అచ్చిరావటం లేదా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతున్నది. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలతో చంద్రబాబు భేటీ అవబోతున్నారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ తమ్ముళ్ళల్లో తెలంగాణా పార్టీ చంద్రబాబుకు అచ్చిరాలేదా ? అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీకి ఇపుడు అర్జంటుగా ఒక అధ్యక్షుడిని నియమించాలి. ఇపుడు పార్టీ వ్యవహారాలను బక్కని నరసింహులే చూస్తున్నారు. మరి బక్కనికే పూర్తిస్ధాయి బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే అరవింద్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
ఇంతలా చర్చ జరుగటానికి కారణం ఏమిటంటే రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేషే తెలంగాణా వ్యవహారాలను చూశారు. అయితే ఎలాంటి లాభం కనబడలేదు. దాంతో లోకేష్ లాభంలేదని అనుకుని ఎల్ రమణను పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. కొంతకాలం తర్వాత రమణ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. కొంత గ్యాప్ తీసుకుని బక్కని నరసింహులను అధ్యక్షుడిగా నియమించారు. తర్వాత ఏమైందో ఏమో కొంతకాలం తర్వాత బక్కనిని పక్కనపెట్టి కాసాని జ్ఞానేశ్వర్ ను అద్యక్షుడిగా నియమించారు. కొంతకాలం తర్వాత అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు కాసాని పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరారు. దాంతో పార్టీ పగ్గాలను తాత్కాలికంగా బక్కనికే చంద్రబాబు అప్పగించారు. పార్టీ పగ్గాలు అందుకోవటానికి సీనియర్లు పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు. అప్పటికి మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి లాంటి సీనియర్లున్నారు. అయితే తర్వాత వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు.
ఇదంతా కూడా ఏపీలో ఎన్నికలకు ముందు జరిగింది. ఇపుడు ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణాలో పార్టీ రాత ఏమైనా మారుతుందో చూడాలి. అందుకనే చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవితో పాటు తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీచేసే విషయం, పార్టీ సభ్యత్వం, స్వచ్చంధ కార్యక్రమాలతో పార్టీ జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళేట్లుగా కార్యక్రమాలను నడిపించగలిగిన సత్తా ఉన్న వారికోసం చంద్రబాబు వెతుకుతున్నారు. శనివారం సాయంత్రం జరగబోయే సమావేశంలో పై అంశాలపై ఒక క్లారిటి వస్తుందని సీనియర్ తమ్ముళ్ళు ఆశిస్తున్నారు. మొత్తంమీద తెలంగాణా పార్టీ చంద్రబాబుకు అంతగా అచ్చి వస్తున్నట్లు అనిపించటంలేదు. మరీసారి ఏమి జరుగుతుందో చూడాలి.