తెలంగాణలొ ‘కోతి చేష్ట’లతో రైతుల గగ్గోలు
x
పంటను నాశనం చేస్తున్న కోతి

తెలంగాణలొ ‘కోతి చేష్ట’లతో రైతుల గగ్గోలు

కోతులను అడవుల్లోకి రానీయం అంటున్న అటవీ శాఖ అధికారులు...


తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో ఉండాల్సిన వానరాలు అటవీ గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. అడవుల్లో కోతులకు తినడానికి పండ్ల చెట్లు కొరవడటంతో అవి గుంపులుగా అటవీ గ్రామాలపై పడ్డాయి. పంట పొలాలను కోతులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అడవి పందులు పంటలను నాశనం చేసేవి. ఇపుడు కోతులు కూడా పెద్ద ఎత్తున పంటల మీద దాడి చేస్తుండటంతో రైతులు పంటపై పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నారు.దీంతో తెలంగాణలో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. చివరకు కోతుల వివాదం హైకోర్టు దాకా వెళ్లింది.


అటవీగ్రామాల్లోకి కోతుల వలస
సాధారణంగా కోతులు అడవిలో లభిస్తున్న పండ్లు, దుంపలు తింటూ అక్కడే సంచరిస్తుంటాయి. అయితే ఇటీవల అడవుల విస్తీర్ణం తగ్గడంతోపాటు పండ్ల చెట్లు అంతరించి పోవడంతో ఆహారం కోసం కోతులు అడవిని వదిలి అటవీ గ్రామాల బాట పట్టాయి. కొందరు జంతు ప్రేమికులు అరటిపండ్లు,టమాటాలు,క్యారెట్, బిస్కెట్లు, బ్రెడ్, పుట్నాలు, పుచ్చకాయలు, దోసకాయలు, సంత్రాలను కోతులకు వేస్తుండటంతో అవి అడవిని వదిలి రోడ్లపైకి వలస వచ్చాయి. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, చెన్నూర్, జైపూర్, బీమారం ప్రాంతాల్లో జాతీయ రహదారిపై కోతుల గుంపులే దర్శనమిస్తుంటాయి.కోతులకు ఆహారాన్ని పెట్టి వాటి సహజ ఆహారపు అలవాట్లను దెబ్బతీస్తున్నారు. కోతులకు ఆహారం పెట్టిన వారిపై ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం కేసులు పెట్టి జరిమానాలు విధిస్తున్నా దీనికి తెరపడటం లేదు. కోతులకు రోడ్లపై ఆహారం పెట్టడం వల్ల వీటి బెడద పెరిగింది. నిజానికి గత ప్రభుత్వం చేపట్టిన హరిత హారం మొక్కల పెంపకంలో భాగాంగా పెద్ద ఎత్తున అటవీ కాయలు, పళ్ల మొక్కలను నాటారు ఇది పెరిగి పెద్దయి కాయలు,పండ్ల కాస్తే, కోతులు వీటికి అలవాటు పడి పొలాల మీద దాడిచేయడం మానేస్తాయని అధికారులు భావించారు. అయితే, ఇదంత విజయవంతమయిన దాఖలా లేదు.

ఇక కోతులు వన్యప్రాణులు కావు...
పట్టుకున్న కోతులను ఎక్కడికి పంపాలి. అడవుల్లోకి పంపాలి. అటవీ గ్రామాల్లో, జనావాసాల్లో వీటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.కోతులు వన్యప్రాణులు కానందున వీటిని అడవుల్లోకి వదిలివేయలేమని సాక్షాత్తూ మంత్రి కొండ సురేఖ ప్రకటించారు. అయితే కోతుల సమస్యను మాత్రం తీర్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే, ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చింది. కోతులు వన్యప్రాణులు కావని, వాటికి ఆ గుర్తింపు రద్దయిన నేపథ్యంలో తాము వీటిని అడవుల్లోకి అనుమతించలేమని తెలంగాణ వన్యప్రాణుల విభాగం ప్రత్యేక అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రజలే కోతులకు ఆహారాన్ని వేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. కోతుల నియంత్రణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంతోపాటు కోతులకు ఆహారం పెడితే తాము కేసులు పెడుతున్నామని ఆయన వివరించారు.

కోతుల నియంత్రణకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు
కోతులు వన్యప్రాణులు కావని ప్రభుత్వం గుర్తించినా, వీటి బెడదను నియంత్రించేందుకు నిర్మల్ జిల్లా నిర్మల్ కేంద్రంగా తాము కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గ్రామ పంచాయితీ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు కోతులను పట్టుకొని కోతుల పునరావాస కేంద్రానికి తీసుకువస్తే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి కోతుల సంతతి పెరగకుండా తమ అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

తెలంగాణలో 3కోట్లకు పైగా కోతులు
తెలంగాణలో 3 కోట్ల కోతులున్నాయని అంచనా వేసినట్లు అటవీశాఖ వన్యప్రాణుల విభాగం అధికారులు చెప్పారు. ఏటేటా కోతుల సంఖ్య పెరుగుతుందని అటవీఅధికారులు పేర్కొన్నారు. తాము వేసిన పంటలు కోతుల వల్ల దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ గ్రామాల్లోనే కాకుండా అటవీ సమీప పట్టణాల్లోని జనవాసాల్లోనూ కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూరగాయలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి.



కోతుల సమస్యపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

తెలంగాణలో కోతుల బెడద కారణంలో పంటలు దెబ్బతిని తీరని నష్టం జరుగుతుందని రైతు సమస్యల సాధిన సమితి అధ్యక్షుడు ఎం మల్లన్న హైకోర్టుకు లేఖ చేశారు. ఈ లేఖను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తి జస్టిస్ రేణుక యారాలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.కోతుల వల్ల పంటలకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడింది.కోతులు పంటలను దెబ్బతీయడమే కాకుండా ప్రజలపై దాడులు చేస్తున్నాయి.

కోతుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారు?
తెలంగాణలో వానరాల బెడద నివారణకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాస్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గతంలోనూ కోతుల బెడదపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ తో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జత చేసి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది.

రోడ్లపై వానరమూకల సంచారం
భూపాలపల్లి, మహదేవపూర్ ప్రాంతాల్లో జాతీయ రహదారులు కోతుల సమూహాలతో నిండి పోయాయి. కాళేశ్వరం, కొండగట్టు లాంటి పుణ్యక్షేత్రాలకు వస్తున్న యాత్రికులు కోతులకు అరటిపండ్లు, కొబ్బరి చిప్పలు, బిస్కెట్లు వేస్తుండటంతో పలు రోడ్లపై కోతులు తిష్ట వేస్తున్నాయి. అమ్రాబాద్ అభయారణ్యంలోని హైదరాబాద్- శ్రీశైలం రోడ్డుపై వానరాల గుంపులు దర్శనమిస్తుంటాయి.తెలంగాణలో పలు రోడ్లపై కోతులు బారులు తీరుతుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.
పంటలకు కోతులు నష్టం చేస్తుండటంతో రైతులు వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు. రాత్రి రాత్రి వానరాల గుంపులు పంటలపై పడి నాశనం చేస్తుండటంతో రైతులు పత్తి సాగుకు మారారు.

కోతుల బెడద తీరేదెలా ?
కోతులను అడవుల్లోకి పంపించడానికి అక్కడ పండ్ల మొక్కులు నాటుతామని, తద్వారా వీటిని అడవుల్లోకి వెళ్లేలా చేస్తామని గతంలో అటవీ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించినా, అమలు చేయలేదు. కోతుల గుంపులు అడవిలోకి వెళ్లేలా పుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా అవి కూడా కార్యరూపం దాల్చలేదు. కోతుల బెడదను శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదు. దీంతో కోతుల సంచారం తెలంగాణలో పెచ్చు పెరుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


Read More
Next Story