
పంచాయతీ ఎన్నికల జాప్యం వల్ల ఎంత నష్టం జరిగిందంటే...
గ్రామపంచాయతీలన్నీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని గడ్డు కాలం ఎదుర్కొంటున్నాయి
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవడంతో అటు కేంద్ర నిధులు రాక రాష్ట్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్స్ (matching grant) యివ్వక నిధులలేమితో డీలా పడిపోయాయి. చివరికి త్రాగునీరు సరఫరా చేయలేక పోయారు. పారిశుద్ధ్య లేమితో పల్లెల్లో దుర్గంధం తాండవించింది. కార్మికులకు జీతాలు చెల్లించటంలో పంచాయతీలు యిబ్బందులు ఎదుర్కొన్నాయి. వాళ్ళు సమ్మె బాట పట్టడంతో గ్రామాల్లో కొన్ని రోజులు అపరిశుభ్రత తాండవం చేసింది. చెత్త రోడ్డుల పైన వుండిపోయింది. వాటర్ మెన్ కూడా సమ్మెలో చేరడంతో నీటిక కటకట అయ్యింది. ప్రజలు యిబ్బంది పడ్డారు.
రాష్ట్రం లో పంచాయతీల గడువు 1, ఫిబ్రవరి 2024 న ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్ ల కాలపరిమితి కూడా అదే నెలలో ముగిసింది. మునికిపాలిటీల గడువు ఈ ఏడు 26, జనవరి లో పూర్తి అయ్యింది.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవటంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి జరుపుతోంది. పంచాయతీ ఎన్నికలు మాత్రం పాత రిజర్వేషన్ ప్రకారమే జరిపి, జిల్లా పరిషత్, మండల పరిషత్ లను రిజర్వేషన్లు పెంచిన తరువాత జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం అన్ని స్థానిక సంస్థలలో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతోంది. ఆర్టికల్ 243ఈ(3)ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. వాటి పదవీకాలం ముగిసిన ఆరు నెలల లోపు ఎన్నికలు జరపాలి. ఎన్నిక అయిన సంస్థలు లేకపోవటంతో కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన రు. 3,268 కోట్ల 15 వ ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోయాయి. యిందులో రు. 277 కోట్లు 2023-24 సంవత్సరానికి చెందినవి కాగా, రు. 1,514 కొట్లు 2024-25 కు, రు. 1,477 కోట్లు 2025-26 కాలానికి అందాల్సినవి.
రాష్ట్రానికి అందే నిధులు 15 వ ఆర్థిక సంఘం (15th finance commission) సిఫారసుల ప్రకారం ముందే నిర్దేశితమై ఉంటాయి. 2021-22 నుండి 2025-26 కాలానికి రు. 7,201 కోట్లు కేటాయించారు. ఈ నిధులను గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్లకు కేటాయించాలని సంఘం నిర్దేశిస్తుంది. అవి ఏ నిష్పత్తి లో జరగాలి మాత్రం రాష్ట్రం నిర్ణయించుకోవచ్చు. తెలంగాణ వాటిని గ్రామ పంచాయతీలకు 85 శాతం, మండల జిల్లా పరిషత్ లకు 10 శాతం, 5 శాతం చొప్పున కేటాయించింది. ఈ నిధులు రెండు విడతలుగా జూన్, అక్టోబర్ నెలల్లో యిస్తారు.
కేంద్ర నిధులు ఆగిపోయాయని ఎన్నికలకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం తన వాటా గా యివ్వాల్సిన రు. 4,838 కోట్లు యివ్వలేదు. ఇందులో 2023-24 కి రు. 1,800 కోట్లు, 2024-25 కాలానికి రు. 1402 కోట్లు, 2025-26 కు రు. 1,635 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర రాష్ట్ర నిధులను కలిపితే స్థానిక సంస్థలు రు. 8,106 కోట్లు సకాలంలో పొందలేదు.
ఈ నిధులలో 60 శాతం నిర్ధిష్ట నిధులు (tide grants) అంటే నిర్దేశిత కార్యక్రమాలకు వాడాల్సినవి. వీటిలో 50 శాతం పారిశుద్ధ్యానికి మిగతా త్రాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, పునర్వినియోగం కోసం వాడాలి. మిగిలిన 40 శాతం పంచాయతీ స్థాయిలో తన నిర్ణయం ప్రకారం ఖర్చు చేయగలిగినవి. యిందులో నుండే రాజ్యాంగం లోని 11 వ షెడ్యూల్ ప్రకారం పేర్కొన్న 29 అంశాలకు ఖర్చు చేయాలి.
నిధులు లేకపోవటంతో పనులు చేపట్టిన సర్పంచులకు రు. 661 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిందని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ చెప్పారు. “అభివృద్ది కార్యక్రమలు ఆగిపోయాయి. ట్రాక్టర్ లలో డీజిల్ పోయలేక పారిశుద్ధ్యం కుంటుపడింది. నిర్మించిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్లు లను కనీసం నిర్వహణ చేయలేకపోయారు. కనీసం పాడైపోయిన నీళ్ళ పైపు లైన్లు, మురికి కాలువల నిర్వహణ సరయిన రీతిలో జరగలేదు. మా గ్రామం లో పార్క్ లో గేమ్స్ కోసం సౌకర్యాలు పెట్టాను అవి చూసేవారు లేకుండా పోయారు. పారిశుద్ధ్య కార్మికులకు చాలా చోట్ల మూడు నుండి ఆరు నెలలు జీతాలు రాలేదు. పవర్ బిల్లులు చెల్లించాలనే పేరుతో పంచయతీల దెగ్గర ఉన్న నిధులను తీసుకున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లను ఏడాపెడా ఏర్పాటు చేయటం తో గ్రామాల నిధులు వాటి చేతిలోకి వెళ్లిపోతున్నాయి. గ్రామాలు నిర్లక్ష్యానికి గురిఅవుతున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్ ఎన్నికలలో ప్రతిపక్షానికి చెందిన పార్టీ అభ్యర్థి ఎన్నిక అయితే మాజీ సర్పంచ్ కు జరిగిన పనులకు నిధులు మంజూరులో సమస్యలు ఎదురవుతాయి, అని అన్నారు.
ఈ పరిస్థితి లో సిసి రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు లాంటివి జరిగే పరిస్థితి లేకుండా పోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక గ్రామ పంచాయతీ సెక్రెటరీ అన్నారు. “ట్రాక్టర్ లో పెట్రోల్ కోసం లేదా వీధి దీపాల కోసం మేమే నిధులు రాగానే ఇస్తామని హామీ యిచ్చి పనులు చేయించాము. వీధి దీపాలు పోతే వాటిని సమయానికి మార్చలేదు. పారిశుధ్యం కోసం అవసరమైన సామగ్రి అవసరం అయిన మేరకు ఇవ్వలేక పోయాము. దోమలకు ఫోగ్గింగ్ కుంటుపడింది. మిషన్ భగీరత నీళ్ళు వచ్చిన స్థానిక బోర్లు నుండి నీరు అవసరం అవుతుంది. అవి పాడైతే బాగుచేయటానికి ఇబ్బంది అయ్యింది లేదా చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పారిశుద్ధ్య కార్మికులను కేటాయించటంతో వాళ్ళకు జీతాలు చెల్లించటం కష్టం అయ్యింది. ప్రభుత్వం ప్రతి 500 మంది ప్రజలకు ఒక కార్మికుడిని కేటాయించి జీతం ఇస్తున్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళు చేయలేరు. నేను చేసిన గ్రామాల్లో ఒక దానిలో ముగ్గురు మరో దానిలో ఆరుగురు పనిచేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదటి గ్రామానికి ఇద్దరినీ, మరో దానికి ముగ్గురిని కేటాయించి వారి జీతానికి నిధులు ఇస్తోంది. మిగిలిన వారికి గ్రామ పంచాయతీ నిధుల నుండి జీతాలు చెల్లించాలంటే నిధులు లేవు,” అని చెప్పారు.
“నెహ్రూ తన దార్శనికత తో గ్రామ స్వరాజ్యం కావాలని పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అధికారాలను వికేంద్రీకరించారు. గ్రామాలలో అగ్రకుల పెత్తనం నడిచిన సమయం లో వాటికి నిధులు ఇచ్చారు. బీసీ లు అధికారాలు కోరుతుంటే వాటిని యిప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు. 69 శాతం రిజర్వేషన్లు కేంద్రం సహకారం లేకుండా ఇవ్వలేమని తెలిసి వాగ్దానం చేశారు. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా వుండటంతో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా హామీ యిచ్చారు. యిది బీసీ లను మోసం చేయడమే. గ్రామాలకు హక్కులు కల్పించాలనే చిత్తశుద్ది వుంటే రాజ్యాంగంలో పేర్కొన్న 29 అంశాల పైన పంచాయతీలకు హక్కులు కల్పించాలి. వీధి దీపాల నిర్వహణ పిపిపి క్రింద ప్రైవేట్ వారికి ఇస్తున్నారు,” అని కాకతీయ విశ్వవిద్యాలయం లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో విశ్రాంత ప్రొఫెసర్ సి. హెచ్. బలరాములు అన్నారు.
బిఆర్ఎస్ తెచ్చిన 2018 పంచాయతీ చట్టం వచ్చాక సర్పంచ్ లకు ఉప సర్పంచ్ తో కలిపి చెక్ అధికారం యిచ్చారు. వార్డు సభ్యులను చేతిలో పెట్టుకుని ఉప సర్పంచ్ అయిన అగ్రవర్ణాల వాళ్ళు పెత్తనం చేయగలుగుతున్నారు. వెనుకబడిన వర్గాలనుండి వచ్చిన సర్పంచ్ లకు స్వేచ్చ లేకుండా పోయింది. అవినీతి నివారించటానికి పంచాయతీ సెక్రెటరీ తో కలిపి చెక్ పవర్ పెట్టచ్చు, అని తెలంగాణ సర్పంచ్ ల సంఘం మొదటి అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ చెప్పారు.
నిధుల దుర్వినియోగం జరిగిన చోట సర్పంచ్ ను సస్పెండ్ చేశారు. ఉప సర్పంచ్ ను కాదు. ఉద్యోగికి తప్పుచేస్తే ఉద్యోగం పోతుంది అనే భయం ఉంటుంది, కాబట్టి పంచాయతీ సెక్రెటరీ తో జాయింట్ చెక్ అధికారం యివ్వచ్చు. ఉప సర్పంచ్ కు ఆ భయం లేదు కదా అన్నారు.
మండల జిల్లా పరిషత్ ల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్ సాధించాకే పెడతామని ప్రభుత్వం చెప్తోంది. కానీ కోర్టుల ద్వారా 50 శాతం రిజర్వేషన్ కోటా లిమిట్ ను దాతటానికి లేదు అని చెప్పించుకుని మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

