తెలంగాణ ప్రజలకు బీజేపీ ఒక్కటే చాయిస్సా..!
x

తెలంగాణ ప్రజలకు బీజేపీ ఒక్కటే చాయిస్సా..!

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎలా అవుతుందో?


ప్రభుత్వాలు మారినా.. ప్రజల అవసరాలు తీరకపోవడం అనేది ప్రతి రాష్ట్రంలో ఉండే సమస్యే. దీనిని ప్రజలు బాహాటంగానే చెప్తారు. ఏదో ఊహించుకుని.. ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. ఈ పాలకులూ అంతే ఉన్నారని చెప్తుంటారు. దీని నుంచి తెలంగాణ ఏమీ మినాయింపు కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనపైనా, ఇప్పుడు కాంగ్రెస్ 18 నెలల పాలనపైన కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అన్ని రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని నేతలు చెప్తున్నా.. ప్రజలు మాత్రం రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల కష్టాలు తీరాలన్నా వాళ్లకి ఉన్న చాయిస్ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అంటున్నారు. ఆయన మాటల ప్రకారం.. తెలంగాణ ప్రజలకు ఉన్న ఆ ఏకైక చాయిస్.. ఈసారి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకురావడం. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వం ఉంటే.. ప్రజల కష్టాలు తీరుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఇది సాధ్యమని అంటున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్‌పై కూడా ప్రజల్లో కాస్తో కూస్తో వ్యతిరేకత, అసహనం ఉన్న మాట వాస్తవమే.. కానీ అందుకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్న రామచందర్ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ప్రజలకు సమస్యలు లేవు? ఎన్ని రాష్ట్రాలు అత్యంత అభివృద్ధి చెంది ఉన్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కదానిలో కూడా ప్రజలు, రైతులు నిరసనలు చేయడం లేదా? ఇలాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు విశ్లేషకులు. ప్రజలు అన్నట్లే రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం కోసం ఎన్నో కహానీలు చెప్తుంటాయని, ప్రజల బతుకులు మారాలంటే మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. పాలకుల తీరు అని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రామచందర్ రావు ఏమన్నారంటే..

‘‘బీజేపీ ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో స్వర్ణయుగం తెస్తుంది. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తో మాత్రమే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతోంది. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భాజపా వైపు చూస్తున్నారు’’ అని రామచందర్‌రావు అన్నారు.

బీజేపీ అన్ని హామీలు నెరవేర్చిందా..?

ఈ నేపథ్యంలోనే కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినా.. బీజేపీ ఎన్నో హామీలు నెరవేర్చలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2016లో నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని కొల్లగొడతామని, దానిని ప్రజలకి పంచుతామని అన్నారని, అదేమైంది? అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా 2014లో అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ.. ఇప్పటి వరకు ఎన్ని కల్పించారు? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో హామీలు అమలు కాలేదన్న విషయం తెలంగాణ బీజేపీ నేతలకూ తెలుసని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎలా అవుతుందో? చెప్పాలని అంటున్నారు.

మరో పార్టీ లేనందుకేనా..?

అయితే తెలంగాణలో ఉన్న మూడు పార్టీల్లో ఇప్పటికే ఒక పార్టీ పాలించడం.. ప్రతిపక్షంలోకి వెళ్లడం జరిగింది. ఇప్పుడు రెండో పార్టీ 18 నెలలుగా పాలన కొనసాగిస్తోంది. కాంగ్రెస్ సర్కార్‌పై కూడా ప్రజల్లో వ్యతిరేకత, అసహనం ఉన్న మాట వాస్తవమే.. ఇక ప్రజలకు చూజ్ చేసుకోవడానికి మిగిలి ఉంది ఒక్క బీజేపీ మాత్రమే.. బీజేపీ అలా ప్రత్యామ్నాయం అవుతుందే తప్ప.. తాము చేసిన పనులతో ప్రజలకు ఒక మంచి చాయిస్‌గా కాలేకపోతోందని, బీజేపీ ముందుగా దానిపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మనమేం చెప్పినా ప్రజలు నమ్ముతార్లే అన్న ధోరణి ఇప్పుడు పనిచేయదని కూడా హెచ్చరిస్తున్నారు.

Read More
Next Story