రూ.547 కోట్ల సైబర్ మోసాల గుట్టు రట్టు
x

రూ.547 కోట్ల సైబర్ మోసాల గుట్టు రట్టు

ఆరుగురు ప్రధాన నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు.


భారీ సైబర్ క్రైమ్‌ను తెలంగాణ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. దాదాపు రూ.547 కోట్ల మోసాలు చేసిన నిందితులు ఆరుగురిని తాజాగా అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా జరిగిన ఈ నేరం దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే జనవరి 2026 తొలి వారంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో సైబర్ మోసగాళ్లు దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసి సుమారు రూ.547 కోట్లను కొల్లగొట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. తాజాగా ఈ నేరానికి పాల్పడిన ఆరుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులకు బ్యాంక్ ఖాతాలు అందించిన మరో 17 మందిపై కూడా అదే సమయంలో కేసులు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలలుగా ఈ సైబర్ ముఠా కార్యకలాపాలపై నిఘా కొనసాగింది. డిసెంబర్ 2025 చివరి వారం నుంచి కీలక ఆధారాలు లభించడంతో జనవరి 2026 మొదటి వారంలో వరుస దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితులు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఖమ్మం జిల్లా పరిధిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న బాధితులను లక్ష్యంగా చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన స్క్రిప్టుల ఆధారంగా కాల్స్ చేసి సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మ్యాట్రిమోని పేరుతో పరిచయాలు పెంచడం రివార్డ్ పాయింట్లు గేమింగ్ బెట్టింగ్ షేర్ మార్కెట్ పెట్టుబడులు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వంటి అంశాలతో భారీ లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. నకిలీ వెబ్‌సైట్లు యాప్‌లు లింకుల ద్వారా బాధితుల బ్యాంక్ వివరాలు ఓటీపీలు సేకరించి అక్రమంగా డబ్బులు మళ్లించినట్లు తేలింది.

ఈ కేసులో ఉపయోగించిన వందలాది బ్యాంక్ ఖాతాలను జనవరి 2026 మొదటి వారంలో పోలీసులు గుర్తించి అనేక ఖాతాలను ఫ్రీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను నిలిపివేశారు. డబ్బును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు తరలిస్తూ చివరికి విదేశీ ఖాతాలకు పంపిన విధానాన్ని లేయరింగ్ ద్వారా అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులకు బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇచ్చిన 17 మంది పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కొందరు స్వల్ప కమిషన్ ఆశతో తమ ఖాతాలను ఇచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన మరికొందరు కీలక నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు మొబైల్ ఫోన్లు హార్డ్ డిస్క్‌లు సిమ్ కార్డులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో డేటా విశ్లేషణ కొనసాగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ కేసు మరింత విస్తరించే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ పెట్టుబడులు అధిక లాభాల హామీలు అనుమానాస్పద కాల్స్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Read More
Next Story