Cyber Crime | సైబర్ నేరాలపై స్పెషల్ ఆపరేషన్.. భారీ ముఠా అరెస్ట్
సైబర్ నేరాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా వేలకు వేల రూపాయలు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు గోతి కాడ గుంటనక్కలా ఉంటున్నారు.
సైబర్ నేరాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా వేలకు వేల రూపాయలు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు గోతి కాడ గుంటనక్కలా ఉంటున్నారు. అవకాశం దొరకడం ఆలస్యం బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఈ నేరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో వీటిపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వీటికి చెక్ పెట్టడం కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ చేసి భారీ సైబర్ ముఠాను అరెస్ట్‌ను చేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. ఈ ముఠాలో 23 మంది ఉన్నారని, వీరంతా కలిపి రూ.5.29కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చేసినట్లు చెప్పారు. ఈ సైబర్ నేరగాళ్లు కూడా ఆ రాష్ట్రాల్లోనే ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే యాక్షన్ తీసుకున్నామని ఆవె తెలిపారు. తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని అన్నారు.
‘‘దేశవ్యాప్తంగా 328 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో మోసాలకు పాల్పడ్డారు వీరు. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం 5.29 కోట్ల రూపాయలు కాజేశారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాము. అక్కడి స్థానిక పోలీసుల సాయంతో అధునాతన టెక్నాలజీని వాడి నిందితులను పట్టుకున్నాం. ఇటీవల సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సొమ్మును మూడు కేసుల్లోనే రూ.39 లక్షలు రీఫండ్ చేశాం. ఆనుమానాస్పద లావాదేవీల విషయంలో ఓ కేసులో 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదులో ఓ మహిళను అరెస్ట్ చేశాం’’ అని తెలిపారు.
‘‘ఆ మహిళ ఢిల్లీలో ఎన్జీవోని రన్ చేస్తుంది. డబ్బులకు ఆశపడి ఆ ఎన్జీవో ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఇచ్చింది. బాధితురాలి సొమ్ము ఆ ఖాతాలో క్రెడిట్ అయిందని తెలుసుకొని ప్రత్యేక బృందం ఆమెను అరెస్ట్ చేసింది. స్థానిక కోర్ లో ప్రవేశ పెట్టినప్పుడు పది మంది లాయర్లు ఆమె కోసం వాదించారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని డీసీపీ కవిత సూచించారు. ఎవరూ కూడా తమ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు.