ప్రాణాలు పణంగా పెట్టిన యాదయ్యకు అరుదైన గౌరవం
హైదరాబాద్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకి అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకి అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతకం (ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ) ఆయనకు దక్కింది. పోలీసులకి ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పతకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. వృత్తి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి యాదయ్య చేసిన సాహసానికి ఈ గౌరవం దక్కింది.
సాధారణంగా ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్ ని ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో పాల్గొనే సీఏపీఎఫ్ బలగాలు, వివిధ విభాగాల పోలీసులకు ఇస్తుంటారు. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసుకి లభించడం చాలా అరుదు. అలాంటి ఘనతని దక్కించుకున్న యాదయ్యని ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ జితేందర్ యాదయ్యను బుధవారం తన ఆఫీసులో సత్కరించారు.
ప్రాణాలకు తెగించి యాదయ్య సాహసం...
యాదయ్య మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ప్రాంతంలో 2022 జులై 25న కాత్యాయని(72) అనే మహిళ తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యతోపాటు కానిస్టేబుళ్లు రవి, దేబేశ్ బృందంగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. తర్వాత రోజు మియాపూర్ లోని బొల్లారం క్రాస్ రోడ్డు వద్ద చైన్ స్నాచర్ల మూమెంట్స్ తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. ముగ్గురు పోలీసులూ రెండు బైకులపై బయలుదేరారు.
రవి ఒక బైక్ నడుపుతుండగా యాదయ్య వెనుక కూర్చున్నారు. మరో బైక్ దేబేశ్ నడుపుతున్నారు. ఈ క్రమంలో బొల్లారం ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న దొంగలను గుర్తించారు. కానిస్టేబుళ్లు వారి వెంటపడ్డారు. కొద్దిసేపట్లోనే దొంగలను అడ్డుకొని, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నిందితుల్లో రాహుల్ (19) అనే వ్యక్తి వాహనం నడుపుతుండగా వెనుక ఇషాన్ నిరంజన్ నీలమ్‌నల్లి (21) కూర్చున్నాడు. తమను అడ్డగించింది పోలీసులు అని తెలియగానే వెంటనే ఇషాన్ కత్తి తీశాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన యాదయ్యను ఏడుసార్లు పొడిచాడు. యాదయ్య పొట్ట, ఛాతి, వీపు, ఎడమచెయ్యి ప్రాంతాల్లో కత్తిపోట్లు తగిలాయి. రక్తం ధారగా కారుతున్నా, తీవ్రమైన నొప్పి వేధిస్తున్నా యాదయ్య ఉడుంపట్టు వదల్లేదు. ఈలోగా మిగతా ఇద్దరు పోలీసులు రాహుల్‌ను పట్టుకున్నారు. అంతలో సెట్‌లో సమాచారం అందుకుని.. సమీపంలో ఉన్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగలిద్దరినీ పట్టుకున్నారు.
అనంతరం యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో 17 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత యాదయ్య కోలుకున్నారు. తర్వాత యాదయ్యకు మూడుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. విచారణలో ఇషాన్, రాహుల్ లు ఎస్ఆర్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు గుర్తించారు. వారింట్లో ఉన్న తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ చైన్ స్నాచింగ్ తోపాటు ఆయుధాల అమ్మే దందా నడుపుతున్న ఘరానా దొంగలుగా తేలింది. ప్రాణాలను లెక్కచేయకుండా వారిని పట్టుకున్న యాదయ్యకు పురస్కారం కోసం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. ఈ క్రమంలో ఆయన సాహసాన్ని గుర్తించిన హోమ్ శాఖ యాదయ్యకి శౌర్య పతాకాన్ని ప్రకటించింది.